వైరస్‌పై నిర్లక్ష్యంగా ఉంటే భారీ మూల్యం తప్పదు

24 Mar, 2020 11:20 IST|Sakshi

ఇటలీలో ఆరువేలు దాటిన కరోనా మరణాలు

స్వీయ నిర్బంధం పాటించకపోతే.. భారీ మూల్యం తప్పదు

ఇటలీ నుంచి గుణపాఠం నేర్పుకోవాలి : వైద్యులు

సాక్షి, న్యూఢిల్లీ : ఇటలీపై కరోనా వైరస్‌ ఏమాత్రం కనికరం చూపడంలేదు. వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రజల ప్రాణాలు మాత్రం పిట్టల్లా రాలిపోతున్నాయి. సోమవారం రాత్రి వరకు ఆ దేశ అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం మరణాలు ఆరువేలు దాటగా.. 60వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. అయితే వైరస్‌పై స్థానిక ప్రభుత్వం, ప్రజలు తొలి నుంచి అప్రమత్తంగా ఉండకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు ప్రస్తుతం కరోనాతో యుద్ధం చేస్తున్న ప్రపంచ దేశాలన్నింటికీ ఇటలీ ఓ గుణపాఠంగా అభివర్ణిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోనే వుహాన్‌లో వెలుగుచూసిన ఈ మహ్మమారి కొంత సమయంలోనే ప్రపంచ దేశాలకు విస్తరించి.. పెద్ద విపత్తునే సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 183 దేశాలను ఈ వైరస్‌ చుట్టుముట్టి.. ముచ్చమటలు పట్టిస్తోంది.

ఇటలీ, ఇరాన్‌ నేర్పిన పాఠాలు..
అయితే వైరస్‌ వ్యాప్తిని ముందుగానే పసిగట్టిన 35 దేశాలు తొలి నుంచి కఠిన చర్యలను అమలు చేయడం ప్రారంభించాయి. వాటిలో వియత్నాం, బ్రెజిల్‌, ఉత్తర కొరియా, నైరో, లిబియా, మాలీ, తజికిస్తాన్‌ వంటి దేశాలు వైరస్‌ను నిరోధించడంలో విజయవంతం అయ్యాయి. అయితే కరోనా ధాటికి చాలా దేశాల్లో పౌరుల ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి. ఈ సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 15 వేలు దాటింది. వైరస్‌ తీవ్రతను ముందుగా హెచ్చరించినా సరైన రీతిలో జాగ్రత్తలు పాటించని కారణంగానే మృతుల సంఖ్య ఈ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. వైరస్‌ వ్యాప్తిపై తొలి నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇటలీ, ఇరాన్‌ అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా పౌరులు పాటించకపోవడం వారు చేసిన పెద్ద తప్పిందంగా వైద్యులు చెబుతున్నారు. (ప్రధాని మోదీ తీవ్ర అసంతృప్తి)

కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటికీ, ప్రభుత్వ ఆదేశాలను ఇటాలీయన్లు బేఖతరు చేశారు. దీంతో కొద్ది కాలంలోనే వైరస్‌ వ్యాప్తి చెంది.. దేశాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. మరోవైపు వైరస్‌కు జన్మస్థలమైన చైనా మాత్రం వీలైనంత త్వరలోనే వ్యాప్తిని కట్టడిచేయడంలో కొంతమేరు సఫలమైందనే చెప్పాలి. ఎందుకంటే గడిచిన మూడురోజులుగా వుహాన్‌లో స్థానికంగా ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఆ దేశ వర్గాలు ప్రకటించాయి. ఇక సామాజిక దూరం, దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌, స్వీయ నిర్బంధాన్ని ఉల్లంఘిస్తే భారీ జరిమానా, జైలుశిక్ష వంటి కఠిన చర్యలతో వైరస్‌ వ్యాప్తిని కట్టడిచేయడంలో విజయం సాధించింది.

భారత్‌లో ఆందోళన..
అయితే ప్రస్తుతం ఆందోళన అంతా భారత్‌లో రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల గురించే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మంగళవారం నాటికి నమోదైన కేసుల సంఖ్య 500 దాటింది. అయితే వైరస్‌ వ్యాప్తి నియంత్రణకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని గత ఆదివారం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే కరోనా తీవ్రత పెరుగుతుండటంతో మార్చి 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించారు. కానీ ప్రజలంతా స్వీయ నిర్బంధం పాటించాలన్న ప్రభుత్వ, వైద్యుల సూచనలను పాటించడంలో మాత్రం విఫలం అవుతున్నారు. పెద్ద ఎత్తున రోడ్లమీదకు వచ్చి.. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారు. (మూడో దశకు సిద్ధమవ్వండి!)

హైదరాబాద్‌తో పాటు, దేశ వ్యాప్తంగా సోమవారం నాటికి పరిస్థితి దీనికి అద్దం పడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ ఉల్లంఘనపై ముఖ్యమంత్రులతో సహా, ప్రధాని కూడా తీవ్ర అసహనం వ్యక్త చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించకపోతే పెద్ద ఎత్తున దుష్పపరినామాలు తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. వైరస్‌పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం తప్పదని, ఇటలీ, ఇరాన్‌ నుంచి గుణపాఠం నేర్చుకోవాలని గుర్తుచేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు