160 మంది ఉగ్రవాదులను ఏరేశాం

20 Oct, 2017 15:07 IST|Sakshi

కశ్మీర్‌లో రాజకీయ చొరవ అవసరం

నేతలు దేశానికి అనుకూలంగా మాట్లాడాలి

జమ్మూ కశ్మీర్‌ డీజీపీ శీష్‌పాల్‌

సాక్షి, శ్రీనగర్‌ : ఈ ఏడాది ఇప్పటివరకూ 160 మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు జమ్మూ కశ్మీర్‌ డీజీపీ శీష్‌పాల్‌ ప్రకటించారు. కశ్మీర్‌ నిరుద్యోగ యువత విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాల్సిన అవసరముందని ఆయన అన్నారు. ఉగ్రవాద సంస్థలు నిరుద్యోగ యువతపై తీవ్ర ప్రభావం చూపుతూ.. వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. అక్రమ చొరబాట్లు, పెట్రేగుతున్న ఉగ్రవాదులను అణిచి వేసే శక్తి పోలీసులు, భద్రతా బలగాలకు ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే యువతకు ఉద్యోగ, ఉపాధి మార్గాలు చూపేలా రాజకీయ పార్టీలు చొరవ చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

దేశంలోని  ప్రధాన రాజకీయ పార్టీలు ఈ దిశగా ఆలోచించకపోవడం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. రాళ్లు విసిరే ఆకతాయిలను స్వతంత్ర సమరయోధులగా పోల్చడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ పార్టీలో భారతదేశానికి అనుకూలంగా మాట్లాడగలిగితే.. ఇక్కడ పూర్తిస్థాయిలో మార్పు తీసుకురావడం సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

దక్షిణ కశ్మీర్‌లో ఈ ఏడాది 160 మంది ఉగ్రవాదులకు హతమార్చామని ఆయన చెప్పారు. గతంలో పోలిస్తే ప్రస్తుతం కశ్మీర్‌, నియంత్రణ రేఖ వద్ద భద్రత బలగాలు శక్తివంతంగా పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు. ఉత్తర కశ్మీర్‌లో 90 మంది వరకూ ఉగ్రవాదులు దాక్కుని ఉన్నట్లు సమాచారం ఉందని.. త్వరలోనే వారిని ఏరి పారేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు