లాక్‌డౌన్‌లోనూ కొనసాగిన దాడులు!

18 Jun, 2020 20:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభంలోనూ జర్నలిస్టులపై వేధింపులు కొనసాగుతున్నాయి. పాలకులు, అధికారుల అలస్వతాన్ని ఎత్తిచూపిన పాత్రికేయులపై కేసులు, అరెస్ట్‌లు, షోకాజ్‌ నోటీసులు, భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసంతో వేధింపుల పర్వం సాగింది. లాక్‌డౌన్‌ సమయంలో కనీసం 55 మంది జర్నలిస్టులు ఇలాంటి వేధింపులు ఎదుర్కొన్నారు. ఢిల్లీకి చెందిన రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (ఆర్‌ఆర్‌ఏజీ) ఈ విషయాలు వెల్లడించింది. మార్చి 25 నుంచి మే 31 వరకు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరిగిన వేధింపులపై ఆర్‌ఆర్‌ఏజీ  తయారు చేసిన నివేదికను ఈ వారం విడుదల చేసింది.  

నివేదిక  ప్రకారం.. లాక్‌డౌన్‌ సమయంలో జర్నలి​స్టులపై ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 11 దాడులు జరిగాయి. జమ్మూ కశ్మీర్‌లో 6, హిమాచల్ ప్రదేశ్ 5, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మహారాష్ట్రలలో నాలుగు చొప్పున కేసులు జర్నలిస్టులపై నమోదయ్యాయి. పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్,  కేరళలలో రెండేసి కేసులు వెలుగు చూశాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, బిహార్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌, నాగాలాండ్, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, తెలంగాణలో ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి.  22 మంది జర్నలిస్టులపై ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయగా, కనీసం 10 మందిని అరెస్టు చేసినట్లు వెల్లడించింది. ఇదే సమయంలో ఏడుగురు జర్నలిస్టులకు సమన్లు ​​లేదా షో కాజ్ నోటీసులు జారీ అయ్యాయి. కనీసం 9 మంది విలేకరులు భౌతిక దాడులకు గురయ్యారు. ప్రెస్‌ కౌన్సిల్‌ నాలుగు కేసులను సుమోటోగా తీసుకుని పరిశీలించింది. (కరోనా మృతి.. కొత్త సవాలు)

తమ ప్రాణాలకు తెగించి కరోనా కట్టడి చర్యల్లో లోపాలు, లోటుపాట్లను వెలుగులోకి తెచ్చిన జర్నలిస్టులపై పెద్ద ఎత్తున దాడులు జరిగినట్టు గుర్తించామని ఆర్‌ఆర్‌ఏజీ డైరెక్టర్‌ సుహాస్ చక్మా పేర్కొన్నారు.  నిర్వహణ లోపాలు, అవినీతి, వలస కార్మికుల / పేదల ఆకలి, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేమి, పీపీఈ కిట్ల కొరత గురించి జర్నలిస్టులు వార్తలు అందించారని తెలిపారు. 

కాగా, మీడియా స్వేచ్ఛ విషయంలో మన దేశ ర్యాంకు నానాటికీ దిగజారుతోంది. పారిస్‌కు చెందిన రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ రూపొందించిన వార్షిక ప్రపంచ ప్రెస్ జాబితా 2020లో భారత్‌ 142వ స్థానంలో నిలిచింది. పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక.. భారత్‌ కంటే మెరుగైన స్థానాల్లో ఉండటం గమనార్హం. మీడియా స్వేచ్ఛ విషయంలో 2021లో ర్యాంక్‌ను  మెరుగుపరుచుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలివ్వడానికి  ‘ఇండెక్స్ మానిటరింగ్ సెల్’ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ ఇటీవల ప్రకటించారు. (చిన్నారికి పాలు తెచ్చిన మహిళా పోలీస్‌)

మరిన్ని వార్తలు