ముజఫర్‌పూర్‌ ఘటనకు నిరసనగా బిహార్‌ బంద్‌

2 Aug, 2018 09:21 IST|Sakshi

పట్నా : బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ బాలికల వసతి గృహంలో మైనర్‌ బాలికలపై లైంగిక వేధింపుల కేసుకు నిరసనగా గురువారం రాష్ట్ర బంద్‌కు లెఫ్ట్‌ పార్టీలు పిలుపు ఇచ్చాయి. బంద్‌కు ఆర్జేడీ, కాంగ్రెస్‌ మద్దతు తెలిపాయి. చిన్నారులపై లైంగిక దాడి ఘటనకు బాధ్యత వహిస్తూ బిహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ముజఫర్‌పూర్‌కు చెందిన ఎన్జీవో సేవా సంకల్ప్‌ ఇవాం వికాస్‌ సమితి నిర్వహిస్తున్న వసతి గృహంలో మైనర్‌ బాలికలపై నిర్వాహకులు, అధికారులు జరిపిన లైంగిక దాడుల ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ముంబైకి చెందిన టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ సంస్థ చేపట్టిన సామాజిక ఆడిట్‌లో ఈ దారుణం వెలుగుచూసింది. చిన్నారులకు మత్తుమందు ఇచ్చి వారిపై లైంగిక దాడులకు పాల్పడటం, వారిని తీవ్రంగా హింసించడం వంటి చర్యలతో షెల్టర్‌ హోంను బిహార్‌ ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌లో ఉంచింది.

కాగా బిహార్‌ బంద్‌కు మద్దతు ఇస్తున్నామని, హేయమైన ఈ ఘటనపై సీఎం నితీష్‌ కుమార్‌ బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ ప్రతినిధి శక్తిసింహ్‌ గోహిల్‌ ట్వీట్‌ చేశారు. నితీష్‌ ప్రభుత్వ ఊతంతో చిన్నారి బాలికలపై జరిగిన సామూహిక లైంగిక దాడి అత్యంత హేయమని ఆర్జేడీ నేత, బిహార్‌ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌ అన్నారు.

>
మరిన్ని వార్తలు