కొద్ది నెలలుగా అస్వస్థత... ముంబై ఆస్పత్రిలో ప్రాణ్ తుదిశ్వాస

13 Jul, 2013 05:34 IST|Sakshi
కొద్ది నెలలుగా అస్వస్థత... ముంబై ఆస్పత్రిలో ప్రాణ్ తుదిశ్వాస

ముంబై: దాదాపు అర్ధ శతాబ్దికి పైగా బాలీవుడ్ చిత్రసీమను ఏలిన నటదిగ్గజం ప్రాణ్ (93) ఇకలేరు. కొద్ది నెలలుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత నెలలోనే ఆయన ఈ ఆస్పత్రిలో చేరారు. ప్రాణ్‌కు భార్య శుక్లా సికంద్, కుమారులు అరవింద్, సునీల్, కుమార్తె పింకీ ఉన్నారు. కరడుకట్టిన కరకు ప్రతినాయక పాత్రలతో పాటు కరుణ రసాత్మకమైన పాత్రల్లోనూ ప్రాణ్ తనదైన ముద్ర వేశారు. ఆయనకు చలన చిత్ర రంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2012 సంవత్సరానికి లభించింది. దాదాపు నాలుగు వందల చిత్రాల్లో నటించిన ప్రాణ్, దేశవ్యాప్తంగా  ప్రేక్షకుల ఆదరాభిమానాలను చూరగొన్నారు. కాశ్మీర్ కీ కలీ, ఖాందాన్, ఔరత్, బడీ బెహన్, జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై, హాఫ్ టికెట్, మధుమతి, పూరబ్ ఔర్ పశ్చిమ్, జంజీర్, బాబీ, డాన్, రామ్ ఔర్ శ్యామ్ వంటి చిత్రాల్లో శక్తిమంతమైన పాత్రలు పోషించి, ప్రేక్షకులను మెప్పించారు.

పాత ఢిల్లీలో 1920 ఫిబ్రవరి 12న జన్మించిన ప్రాణ్ అసలు పేరు ప్రాణ్ కేవల్ సికంద్. కపుర్తలా, ఉన్నావో, మీరట్, డెహ్రాడూన్, రామ్‌పూర్ తదితర ప్రాంతాల్లో విద్యాభ్యాసం సాగించారు. తొలుత ఫొటోగ్రాఫర్‌గా రాణించాలనుకున్న ప్రాణ్, అనుకోకుండా నటుడిగా మారారు. ‘యమ్లా జాట్’ అనే పంజాబీ చిత్రం ద్వారా 1940లో ఆయన హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత చౌదరి (1941), ఖాందాన్ (1942), కైసే కహూ (1945), బద్నామీ (1946) వంటి చిత్రాల్లో నటించారు. దేశ విభజన తర్వాత భార్య శుక్లా, కుమారులు అరవింద్, సునీల్‌లతో కలసి లాహోర్ నుంచి ముంబైకి మకాం మార్చారు. ముంబైకి వచ్చిన తొలినాళ్లలో వేషాలు దొరుకుతాయనే ఆశలు దాదాపు వదిలేసుకున్న దశలో ప్రముఖ రచయిత సాదత్ హసన్ మాంటో సాయంతో దేవానంద్ కథానాయకుడిగా నటించిన ‘జిద్దీ’ (1948) చిత్రంలో వేషం దక్కించుకున్నారు.

అప్పటి నుంచి ప్రాణ్ కెరీర్ పుంజుకుంది. 1969-82 కాలంలోనైతే ప్రాణ్ బాలీవుడ్‌ను దాదాపు మకుటంలేని మహారాజులా ఏలారు. ఆ కాలంలో ఆయన హీరోలతో సమానమైన పారితోషికం అందుకునే వారు. స్వతహాగా అందగాడైన ప్రాణ్, తన విలక్షణమైన నటనతో విలన్ పాత్రలకు సైతం ఆకర్షణ తెచ్చిపెట్టారు. విలన్‌గా ఆయన ప్రాభవం కొనసాగుతున్న కాలంలో ఉత్తరాదిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ‘ప్రాణ్’ అనే పేరు పెట్టడం మానుకున్నారంటే, ఆయన ఘనత ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు విలన్‌గా రాణిస్తున్న కాలంలోనే ‘ఉపకార్’లో మంగల్ చాచా, ‘జంజీర్’లో అమితాబ్ బచ్చన్‌కు సహచరునిగా షేర్‌ఖాన్, ‘పరిచయ్’లో తాతయ్య వంటి సున్నితమైన పాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పించారు. తాండ్ర పాపారాయుడు, కొదమసింహం చిత్రాల ద్వారా ప్రాణ్ తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. విలన్ వేషాలతో గుర్తింపు పొందిన ప్రాణ్, నిజ జీవితంలో మాత్రం చాలా ఉదారుడు, సున్నిత హృదయుడు. పాకిస్థాన్‌తో యుద్ధం ముగిశాక, బంగ్లా శరణార్థుల కోసం 1971లో చారిటీ షో నిర్వహించారు. పేదలు, వికలాంగులను ఆదుకునేందుకు కూడా పలుసార్లు ఇలాంటి ప్రదర్శనలు నిర్వహించి, వాటి ద్వారా సమకూరిన నిధులను మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ‘అండ్ ప్రాణ్’ పేరిట ఆయన రాసిన ఆత్మకథకు అమితాబ్ బచ్చన్ ముందుమాట రాశారు.

ప్రముఖుల సంతాపం
ప్రాణ్ మృతి పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కొన్ని తరాల ప్రేక్షకులను ఆయన తన అసమాన నటనతో అలరించారని ప్రధాని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాను నటించిన ప్రతి చిత్రంలోనూ నటనలో కొత్త ప్రమాణాలను నెలకొల్పిన ప్రాణ్ మృతి భారత చలనచిత్ర రంగానికే తీరని లోటు అని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి మనీష్ తివారీ ఒక ప్రకటనలో కొనియాడారు. అరుదైన ప్రతిభా పాటవాలు గల నటుడిని కోల్పోయామని లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్ సంతాపం తెలిపారు. ప్రాణ్ మరణవార్తతో బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, ముంబైలోని శివాజీ పార్కులో ప్రాణ్ అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతాయని ఆయన కుమారుడు సునీల్ తెలిపారు. బాలీవుడ్ ప్రముఖులు అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, రితేశ్ దేశ్‌ముఖ్, కబీర్ బేడీ, ప్రతీ జింటా తదితరులు ‘ట్విట్టర్’ ద్వారా తమ సంతాపం ప్రకటించారు.
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు