వామ్మో.. చిరుత

19 Jul, 2014 00:04 IST|Sakshi
వామ్మో.. చిరుత

* సీసీ కెమెరాల్లో కదలికలు
* గొర్రెలు మేపడంపై నిషేధాజ్ఞలు
* చిరుత దాడిలో రేంజర్ మృతి
 చెన్నై, సాక్షి ప్రతినిధి: చిచ్చరపిడుగుల్లాంటి రెండు చిరుతలు చెంగల్పట్టు జనావాసాల్లోకి ప్రవేశించాయి. వీటి కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికులు భయంతో వణికిపోతున్నా రు. చెంగల్పట్టు పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని రెండు నెలలుగా స్థానిక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అయితే ఇవన్నీ పుకార్లేనని అటవీశాఖ కొట్టి పారేసింది. ఓ పశువుల కొట్టంలో కట్టివేసిన దూడను మే 19వ తేదీ రాత్రిచంపి తినేసింది. బాధిత రైతు ఫిర్యాదు మేర కు దూడ మాంసాన్ని అటవీశాఖాధికారులు పరిశోధన చేసి నిర్ధారణకొచ్చారు.

కలెక్టర్ సౌందరపాండియన్ నేతృత్వంలో చెంగల్పట్టు పరిసరాలైన తిరుమణి, తిరుక్కుళుకున్రం, తాళంపాడు, తిరువడిశూలం, పనంగాటిపాక్కం, వండలూరుల్లో బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుతను ఆకర్షించేందుకు బోన్లలో కుక్కలు, గొర్రెలను ఉంచారు. ఇందు కు జంతు సంక్షేమ సంఘం ప్రతినిధులు నిరసన తెలపడంతో వాటిని వదిలివేసి వలలు ఏర్పాటు చేశారు. గొర్రెల కాపర్లకు, అడవుల్లోకి వెళ్లే ప్రేమజంటలకు చిరుత కనపడుతుందేగానీ సీసీ కెమెరాల్లో చిక్కలేదు. ఆ తరువాత అంజార్ ప్రాంతంలో సీసీ కెమెరాలు పెట్టారు. అయినా ఫలితం లేకపోయింది.  

అటవీశాఖకు మళ్లీ అనుమానం వచ్చింది. మరో పది చోట్ల సీసీ కెమెరాలను ఉంచారు. ఎట్టకేలకు గురువారం రాత్రి సీసీ కెమెరాల్లో చిరుత సంచారం కనపడింది. ఐదేళ్ల వయస్సు కలిగిన చిరుత కదలికలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వాటి పాదం గుర్తుల ఆధారంగా వివరాలను సేకరించాల్సిందిగా అటవీశాఖను ఆదేశించినట్లు శుక్రవారం తనను కలిసిన మీడియాకు సౌందరపాండియన్ చెప్పారు. గొర్రెలు మేపరాదని, అటవీ సరిహద్దుల్లో ఒంటరిగా సంచరించరాదని నిషేధాజ్ఞలు జారీచేసినట్లు తెలిపారు.

ఊటీ, వాల్‌పారై, కోవై తదితర ప్రాంతాల్లో చిరుత సంచారం ఉందని ఓ అటవీశాఖాధికారి చెప్పారు. అడవిలో బోన్లు, గొలుసులు పెట్టినట్లు చెప్పారు. బోనులో కుక్క చిక్కుకుంటే 3 కి.మీ, చిరుత, గొర్రె తదితర జంతువులు చిక్కుకుంటే 2 కి.మీ వరకు వినిపించేలా సైరన్ అమర్చినట్టు తెలిపారు. జనావాసంలో సంచరిస్తున్న చిరుతలను వారంలోగా పట్టుకుంటామని వెల్లడిం చారు. సీసీ కెమెరాల్లో కనపడుతున్న చిరుత గర్భంతో ఉందని, ఇదే ప్రాంతంలో మరో మగ చిరుత కూడా ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు.
 
చిరుత దాడిలో రేంజర్ మృతి: ఈరోడ్డు జిల్లా సత్యమంగళం అటవీ చెక్‌పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న కృష్ణన్ (53) అనే రేంజర్‌ను గురువారం రాత్రి ఓ చిరుత పొట్టనపెట్టుకుంది. చెక్‌పోస్టులో కృష్ణన్‌తో పాటు ముత్తుస్వామి (40) అనే మరో రేంజర్ కూడా ఉన్నారు. గురువారం రాత్రి చెక్‌పోస్టుకు సమీపంలోని బంకులో టీ తాగేందుకు ముత్తుస్వామి వెళ్లాడు. ఇంతలో ఓ చిరుత వచ్చి కృష్ణన్‌పై దాడిచేసింది. భయాందోళనకు గురైన ముత్తుస్వామి ఫ్లయింగ్ స్క్వాడ్, అగ్నిమాపక దళాలకు సమాచారం అందించాడు. హుటాహుటిన అక్కడికి చేరుకుని బాణసంచాకాలుస్తూ, కాగడాలతో చిరుతను తరిమివేశారు. అయితే అప్పటికే కృష్ణన్ చనిపోయినట్లు గుర్తించారు. ఇదే చెక్‌పోస్టు వద్ద ఇటీవల ఓ లారీ డ్రైవర్‌ను సైతం చిరుత బలితీసుకుంది.

మరిన్ని వార్తలు