క్యాంపస్‌లోకి చిరుత

24 Dec, 2016 20:12 IST|Sakshi
క్యాంపస్‌లోకి చిరుత

పుణె: పుణె క్యాంపస్‌లోకి చిరుతపులి చొరబడింది. అక్కడ భయానక వాతావరణం సృష్టించింది. విద్యార్థులంతా గజగజ వణికిపోయారు. అధికారులు వచ్చి దాదాపు నాలుగు గంటలపాటు శ్రమించి చివరకు దాన్ని బంధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంక్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐబీఎం) క్యాంపస్‌లోకి తెల్లవారు జామున ఓ మూడేళ్ల చిరుత చొరబడి ఓ చిన్నగదిలో నక్కింది. క్యాంపస్‌లోని ఓ మహిళా ఉద్యోగి తొలుత ఆ చిరుతను గమనించింది. ఆ తర్వాత అలికిడి విన్న చిరుత అదే భవంతిలోని మరో గదిలోకి వెళ్లింది.

ధైర్యం చేసిన ఆ మహిళ మెల్లగా ఆ గది దగ్గరకు వెళ్లి తలుపు గడి వేసింది. ఆ వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని, క్యాంపస్‌ పరిపాలన అధికారులను అప్రమత్తం చేయడంతో సరిగ్గా తొమ్మిది గంటల ప్రాంతంలో అటవీ శాఖ అధికారులకు విషయం తెలియజేశారు. అనంతరం అక్కడి వచ్చిన అధికారులు ఆ గది కిటికీ అద్దాలు పగులకొట్టి ఆ చిరుతకు మత్తుమందు ఇచ్చేందుకు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. టేబుల్‌ కింద చిరుత దాక్కోవడంతో వారికి కష్టమైంది. చివరకు మూడుగంటల అనంతరం దానికి మత్తు సూది వేయగలిగారు. చివరకు ఎలాంటి గాయాలు లేకుండానే చిరుతను సురక్షితంగా తీసుకెళ్లారు. 

మరిన్ని వార్తలు