సర్జికల్‌ దాడుల్లో చిరుత మూత్రం..!

12 Sep, 2018 16:58 IST|Sakshi

పుణే: సర్జికల్‌ స్ట్రైక్స్‌ (సునిశిత దాడులు)కు చిరుత మూత్రానికి సంబంధం ఏంటి? అంటే సంబంధం ఉంది. 2016 సెప్టెంబర్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వెంబడి పీవోకేలో 1సైన్యం జరిపిన సర్జికల్‌ దాడుల్లో అత్యాధునిక ఆయుధాలతోపాటు చిరుత మలమూత్రాలను కూడా భారత సైన్యం వినియోగించిందట! పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దాడులు చేసే సమయంలో సైన్యం కదలికలను చూసి కుక్కలు మొరగకుండా ఉండేందుకు చిరుత మల మూత్రాలను చల్లారట.

ఈ విషయాన్ని లెఫ్ట్‌నెంట్‌ జనరల్‌ (రిటైర్డ్‌) రాజేంద్ర నింభోర్కర్‌ వెల్లడించారు. జమ్మూ రీజియన్‌లో ఎల్‌వోసీ వెంబడి భద్రతను పర్యవేక్షించే 15 దళాలకు అధిపతిగా ఈయన విధులు నిర్వర్తించారు. సర్జికల్‌ దాడులకు ప్రణాళిక రచించడంలో కీలక పాత్ర పోషించారు. పుణేలో థోర్లే బాజీరావ్‌ పీష్వా ప్రతిష్టాన్‌ ట్రస్ట్‌ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎల్‌వోసీ అవతలి గ్రామాల్లోని కుక్కలు సైన్యాన్ని చూసి మొరిగే అవకాశం ఉంది. అదే జరిగితే వాటి అరుపులకు శత్రు దళాలు అప్రమత్తమవుతాయి.

దీన్ని దృష్టిలో ఉంచుకుని మా సైనికులు చిరుత మల, మూత్రాలను చల్లుకుంటూ వెళ్లారు. చిరుతలకు కుక్కలు భయపడుతాయనే విషయాన్ని నౌషేరా సెక్టార్‌లో బ్రిగేడ్‌ కమాండర్‌గా ఉన్న సమయంలో నేను గమనించాను’’ అని వివరించారు. ‘‘దాడులకు సంబంధించిన ప్రణాళిక రచించే విషయాన్ని అత్యంత రహస్యంగా ఉంచాం. ప్రణాళిక అమలు పరచేందుకు.. అప్పటి రక్షణ మంత్రి మనోహర్‌ పర్రీకర్‌ మాకు ఒక వారం సమయం ఇచ్చారు. దాడులు చేయడానికి ఒకరోజు ముందు మాత్రమే మా దళంతో లకి‡్ష్యత ప్రాంతాన్ని గురించి చెప్పాను’’ అని నాటి సంగతులను వెల్లడించారు.

మరిన్ని వార్తలు