కుక్క అనుకొని చిరుతపైకి వెళ్లిన ఎంపీ గార్డు

13 Jan, 2018 11:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అప్పటి వరకు విధుల్లో ఉన్న అటవీశాఖ అధికారులు అలసిపోయి గాఢ నిద్రలోకి వెళ్లారు. అంతలోనే ఫోన్‌.. చిరుత పులి వచ్చిందని.. వెంటనే రావాలని. అయితే, సామాన్యుల నుంచి ఫోన్‌ వస్తే కాస్తంత ఆలస్యం చేసేవారేమోగానీ ఫోన్‌ వెళ్లింది మాత్రం ఓ ఎంపీ ఇంటి నుంచి.. అవును గురువారం రాత్రి ప్రముఖ బాలీవుడ్‌ నటి, ఎంపీ హేమమాలిని ఇంటి నుంచి చిరుతపులి వచ్చిందంటూ అటవీశాఖ అధికారులకు ఫోన్‌ వచ్చింది. దాంతో ఉరుకులు పరుగుల మీద వారు అక్కడికి చేరుకున్నారు. వివరాల్లోకి వెళితే..

గురువారం రాత్రి గుర్గావ్‌లోని హేమ ఇంటి ముందు వాచ్‌మెన్‌ కూర్చొని ఉండగా ఓ చిరుతపులి ఆ వైపుగా వచ్చింది. ఆమె ఉంటున్న కాలనీలో కలియ దిరిగింది. తొలుత కుక్కేమో అనుకొని లాఠీతో తరిమే ప్రయత్నం చేసేందుకు వెళ్లిన వాచ్‌మెన్‌ అది చిరుత అని గమనించాడు. వెంటనే ఈ విషయం చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు అటవీ శాఖ అధికారులకు తెలిపారు. దీంతో వారంతా అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునే ప్రయత్నం చేయగా అది తప్పించుకుంది. సాధారణంగా తిరమే ప్రయత్నం చేసినప్పుడు, వాటిని బంధించే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే చిరుత పులులు దాడులు చేస్తాయని అధికారులు చెప్పారు. చిరుత పులులు వచ్చినప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదో వివరించి వెళ్లారు.
 

మరిన్ని వార్తలు