మీరూ ఒక జర్నలిస్టుగా పనిచేయండి

30 Mar, 2020 18:20 IST|Sakshi

లాక్‌డౌన్‌ చిట్కాలు

(సాక్షి, వెబ్‌ ప్రత్యేకం) : ప్రపంచాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టిపీడిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్‌డౌన్‌ను ప్రకటించింది. దీంతో అత్యవసర సేవల్లో ఉన్న వారు కాకుండా మిగిలిన వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. మనిషికి మనిషికి మధ్య దూరంగా ఉంచడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలన్న సంకల్పంతో దేశమంతా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. 

ఇలాంటి విపత్కరమైన పరిస్థితులు మునుపెన్నడూ అనుభవంలోకి రాలేదు. ఎన్నో ప్రణాళికలు, భవిష్యత్తుకు అవసరమైన ఎన్నో వ్యూహాలు అనుకున్న తరుణంలో కరోనా అడ్డొచ్చింది. కొందరు పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నారు. మరికొందరు ప్రయాణాలు వాయిదా వేస్తున్నారు. చేయాలనుకున్న పనులకు కరోనా అవాంతరాలు. ఇందుకు ఏ ఇళ్లూ అతీతం కాలేదు. అంతా ఇళ్లకు పరిమితమయ్యారు. కొందరు ఇంటినుంచే (Work From Home) పనిచేస్తుంటే మరికొందరికి సెలవులు. స్కూళ్లు, కాలేజీలు ఏవీ నడవటం లేదు. సినిమాలు షికార్లు బంద్. అంతా ఒకరకమైన అయోమయ పరిస్థితి. ఖాళీగా కూర్చోలేక ఇంట్లో కొందరు సినిమాలు చూస్తుంటే కొందరు నిత్యం వార్తల వెంట పరుగెత్తుతున్నారు. 

అయితే, చాలా మంది తమలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నారు. కొందరు టిక్‌టాక్‌ చేస్తూ స్టార్లుగా మారిపోతున్నారు. సెటైర్లు, సెంటిమెంట్లతో సోషల్‌ మీడియా మార్కెట్‌ను ఊపేస్తున్నారు. కొందరు క్రియోటివ్‌ మీమ్స్‌ చేసే పనిలో పడ్డారు. ఇంకొందరు క్రియేటివ్‌ ఆర్ట్స్‌, పెయింటింగ్స్‌ వంటివాటిల్లో మునిగితేలుతున్నారు. కొందరు తమ పిల్లల్లోని ప్రతిభను వెలికితీయడానికి తోడ్పాటునందిస్తున్నారు. కొత్త కొత్త ప్రయోగాలు కొంగొత్త ప్రణాళికలు... కరోనాను కంట్రోల్‌ చేయడంలో తమవంతు బాధ్యతగా ఇంట్లోనే కాదు ఇంటినుంచి సామాజిక సేవా కార్యక్రమాలు... ఇలా ఒకటేమిటి. ఎన్నో ఎన్నెన్నో...! ఈ పరీక్షా కాలం ఇంకెన్ని రోజులో ఇప్పుడే చెప్పలేం. మనకోసం మన భవిష్యత్తు కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఉన్న కుటుంబాలకు అండగా నిలవాల్సిన తరుణం. 

వైరస్‌ వ్యాప్తి నిరోధించడానికి మీ అపార్ట్‌మెంట్లలో లేదా మీ కాలనీల్లో ఎన్నో చర్యలు చేపట్టి ఉండొచ్చు. అలాగే కొందరు వ్యక్తులు లేదా షాపులు లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా చాలా తేలిక భావంతో వ్యవహరిస్తుండొచ్చు. ఇలాంటి భిన్నమైన ఘటనలను కూడా సాక్షి ద్వారా సమాజానికి తెలియజేయండి. 

మొత్తంమీద ఈ లాక్‌డౌన్‌ నేర్పిందెందో...! నేర్చుకున్నవెన్నో...!!  వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో మీ వంతు బాధ్యతగా ఇంట్లో లాక్‌డౌన్‌ అయిన మీరు మీ అనుభవాలను, కొత్త ఆలోచనలను, కొత్త కొత్త ప్రయోగాలు, క్రియేటివ్స్‌, మీరు చేసిన పనులు ప్రయోగాలను వివరంగా మాకు పంపిస్తే వాటిని ప్రచురిస్తాం. మీరు పంపే వివరాలు 500 పదాలు మించకుండా అవసరమైన ఫోటోలను జత చేసి మీ పేరు, ఫోన్‌ నంబర్‌ వంటి పూర్తి వివరాలతో పంపిస్తే వాటిని ప్రచురిస్తాం. 

ఇంకెందుకు ఆలస్యం. ఇంటినుంచే మీరో జర్నలిస్టుగా మారండి. మీ కథనాలను webeditor@sakshi.com కు పంపిస్తే వాటిని సాక్షి వెబ్‌సైట్‌లో ప్రచురిస్తాం. 

మరిన్ని వార్తలు