కేజ్రీ వర్సెస్‌ ఎల్జీ; సుప్రీం కీలక తీర్పు

4 Jul, 2018 11:39 IST|Sakshi

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు స్వతంత్ర అధికారాలు లేవు : సుప్రీంకోర్టు

సాక్షి, ఢిల్లీ : ఆమ్‌ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దూకుడుకు బ్రేక్‌ పడింది. కొంత కాలంగా వివాదంగా మారిన ఢిల్లీ పరిపాలన అధికారాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఢిల్లీ పరిపాలన విభాగానికి అధిపతి ఎవ్వరన్న దానిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు ఎలాంటి స్వతంత్ర అధికారాలు ఉండవని, మంత్రి మండలి నిర్ణయానికి ఎల్జీ కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 239ఏఏను అనుసరించి రాష్ట్రపతికి నివేదించాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తితో పనిచేయాలని, ప్రభుత్వ విధులకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆటంకంగా మారొద్దని తీర్పులో పేర్కొంది. ఇతర రాష్ట్రాలకు ఉన్న అధికారాలు కేంద్రపాలిత ప్రాంతమైన ఢిల్లీకి ఉండవని స్పష్టం చేసింది.

రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం కాలరాస్తోందంటూ ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తొమ్మిది రోజుల పాటు ఎల్జీ అనిల్‌ బైజాల్‌ ఇంట్లో ధర్నా చేసిన విషయం తెలిసిందే. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను అడ్డుపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యవహారాల్లో తలదూరుస్తుందంటూ కేజ్రీవాల్‌ గతంలో ఆరోపించారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రభుత్వ పథకాల అమలులో మంత్రిమండలికి సహరించట్లేదని కేజ్రీవాల్‌ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో  అరవింద్‌ కేజ్రీవాల్‌కు కొంత ఊరట లభించింది. 

మరిన్ని వార్తలు