పెళ్లి, వారసత్వ హక్కుల కోసం....

8 Sep, 2018 23:01 IST|Sakshi

సెక్షన్‌ 377పై విజయంతో ఉద్యమించనున్న గే లు

వారి వివాహాన్ని ఆమోదించబోమంటున్న సర్కారు

సెక్షన్‌ 377పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఉత్సాహం పొందిన ఎల్‌జీబీటీక్యూలు ఇప్పుడు ఇతర హక్కుల సాధనపై దృష్టి సారిస్తున్నారు. ఇతరుల్లా తమకు కూడా వివాహం, వారసత్వం, సరోగసి,దత్తత వంటి విషయాల్లో హక్కులు కల్పించాలని వారు ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నారు.అయితే, ధర్మాసం స్వలింగ సంపరాన్ని నేరం కాదన్న అంశం వరకే పరిమితం కావాలని  ఇతర హక్కుల జోలికి వెళ్లరాదని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ సెక్షన్‌ 377 కేసు విచారణలో సుప్రీం కోర్టుకు స్పష్టం చేశారు.

దీన్ని బట్టి గేలకు ఇతర హక్కులు కల్పించడానికి ప్రభుత్వం సుముఖంగా లేదని అర్థమవుతోందని న్యాయ నిపుణులు అంటున్నారు.వివాహం, సరోగసి, దత్తత, వారసత్వం వంటి హక్కుల కోసం గేలు  పోరాడాల్సి వస్తే తప్పకుండా పోరాడుతామని గే హక్కుల ఉద్యమకారుడు, సుప్రీం కోర్టు న్యాయవాది అదిత్య బందోపాధ్యాయ స్పష్టం చేశారు. 377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు గేల ఇతర హక్కులపై చర్చకు అవకాశం కల్పిస్తుందని సీనియర్‌ జర్నలిస్టు, ఎల్‌జీబీటీ హక్కుల కార్యకర్త ప్రసాద్‌ రామమూర్తి ఆశాభావం వ్యక్తం చేశారు.

స్వలింగ సంపర్కం నేరం కాదన్న సుప్రీం కోర్టు తీర్పుతో గేలకు ప్రాథమిక హక్కు లభించింది కాబట్టి వివాహం, వారసత్వం, బీమా వంటి హక్కులు కూడా దీనిలో భాగమవుతాయని,ఈ హక్కుల్ని నిరాకరించడం రాజ్యాంగవిరుద్ధమని 377 కేసు పిటీషనర్‌లలో ఒకరైన సునీల్‌ మెహ్రా అన్నారు.    377 సెక్షన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మా విజయంలో మొదటి అడుగు. వివాహం ఇతర హక్కుల సాధన రెండో అడుగు వేస్తాం అని మరో పిటిషనర్‌ గౌతమ్‌ యాదవ్‌ వ్యాఖ్యానించారు.

న్యాయపరమైన అంశాలపై అంతగా అవగాహన లేనప్పటికీ గోద్రేజ్‌ వంటి కార్పొరేట్‌ సంస్థలు చాలా ఏళ్ల క్రితమే గేలకు ఇతరులతో పాటు సమాన హక్కులు కల్పించాయి.‘ ఎల్‌జీబీటీ ఉద్యోగుల పట్ల వివక్ష చూపకపోవడం,  ఇతర ఉద్యోగుల్లాగే ఆరోగ్య బీమా వంటి అన్ని సదుపాయాలు అందించడం ద్వారా వారిని మాలో కలుపుకోవడమే మా విధానం’అన్నారు గోద్రేజ్‌ ఇండియా కల్చరల్‌ ల్యాబ్‌ అధిపతి పరమేశ్‌ సహాని.
గేల వివాహాన్ని ఆమోదించదు

స్వలింగ సంపర్కం నేరం కాదన్నంత వరకు బాగానే ఉందని, అయితే వారి వివాహాన్ని కూడా చట్టబద్దం చేయాలన్న డిమాండును మాత్రం ప్రభుత్వం వ్యతిరేకిస్తుందని  ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌)కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.‘ఇద్దరు మహిళలు లేదా ఇద్దరు పురుషులు పెళ్లాడటమన్నది ప్రకృతి విరుద్ధం.దీన్ని మేమెంత మాత్రం సమర్థించం.ఇలాంటి సంబంధాలను గుర్తించే సంప్రదాయం భారతీయ సమాజంలో లేనేలేదు’అని స్పష్టం చేశారు ఆరెస్సెస్‌ ప్రతినిధి ఆరుణ్‌ కుమార్‌. సెక్షన్‌ 377 రద్దును స్వాగతించిన కాంగ్రెస్‌ గేలకు ఇతర హక్కుల కల్పన విషయంలో తన వైఖరి స్పష్టం చేయలేదు. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవలసింది ప్రభుత్వమేనని తర్వాతే  దానిపై స్పందిస్తామన్నారు కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా.

ఇతర హక్కుల జోలికెళ్లని ధర్మాసనం స్వలింగ సంపర్కం  నేరం కాదంటూ తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్టు వారి ఇతర హక్కుల జోలికి వెళ్లలేదు. సామాజిక నిబంధనలు గేల రాజ్యాంగ హక్కులను ఎలా నియంత్రించజాలవో తన తీర్పులో వివరించిన ధర్మాసనం వివాహం, వారసత్వం వంటి ఇతర హక్కుల గురించి ఏమీ ప్రస్తావించలేదు. అలాంటి పెళ్లిళ్లు జరుగుతున్నాయి మన దేశంలో స్వలింగ వివాహాలు(సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌) చట్టబద్ధం కానప్పటికీ గత పదేళ్లుగాజరుగుతూనే ఉన్నాయి. చట్టానికి భయపడే కొందరు అలాంటి వివాహాల్ని ఆమోదించే ఇతర దేశాలకు వెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు.377 కేసు పిటిషనర్‌ ఒకరు ఇలాగే విదేశానికి వెళ్లి పెళ్లి చేసుకున్నారు.
                

మరిన్ని వార్తలు