రైతుల అప్పులను ప్రభుత్వమే చెల్లించాలి

22 Nov, 2017 03:52 IST|Sakshi
తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలతో బ్యానర్‌

 ‘రైతు పార్లమెంటులో’ తెలంగాణ రైతు సంఘాల డిమాండ్‌

సాక్షి, న్యూఢిల్లీ: పంట గిట్టుబాటు ధర లేక వడ్డీ వ్యాపారుల వద్ద రైతులు చేసిన అప్పులను ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. దేశ వ్యాప్తంగా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సుమారు 184 రైతు సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో తలపెట్టిన ‘రైతు పార్లమెంటు’ రెండో రోజు కూడా కొనసాగింది. నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రి, వరంగల్, జనగాం, ఆదిలాబాద్‌ ప్రాంతాల్లో ఆత్మహత్య చేసుకున్న 40 మంది రైతుల కుటుంబీకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినీ నటుడు ఆర్‌. నారాయణమూర్తి మాట్లాడుతూ, కార్పొరేట్‌ సంస్థలకు రాయితీలిస్తున్న ప్రభుత్వాలు తిండిపెట్టే రైతులకు రుణ విముక్తి ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను దేశ వ్యాప్తంగా అమలు చేయా లని కోరారు. రైతుల అప్పులను కేరళ ప్రభుత్వం తరహాలో తెలంగాణ ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టి.సాగర్‌ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ. 6 లక్షల పరిహారం ఇస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం విస్మరించిందన్నారు. 

వ్యవసాయాన్ని ప్రైవేటు పరం చేసే కుట్ర
ఏపీలో వ్యవసాయాన్ని ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఏపీ రైతు సంఘం కార్యదర్శి పి. పెద్దిరెడ్డి విమర్శించారు. ఏపీలో భూములను కార్పొరేట్‌ సంస్థలకు ధారా దత్తం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా రైతు రుణ మాఫీ, రైతు సమస్యల పరిష్కారానికి అత్యవసరంగా పార్లమెంటును సమావేశపరచాలని సదస్సులో తీర్మానం చేశారు. 

మరిన్ని వార్తలు