జమ్మూకశ్మీర్‌లో అత్యధిక ఆయుర్దాయం

27 Oct, 2016 13:49 IST|Sakshi

న్యూఢిల్లీ: అత్యధిక ఆయుర్దాయం కలిగిన రాష్ట్రంగా జమ్మూకశ్మీర్‌ నిలిచింది. 2010 వరకు ఈ జాబితాలో కేరళది అగ్రస్థానం. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ) ఈ విషయాలను వెల్లడించింది. 2010 నుంచి 2014 వరకు పలు దఫాలుగా జరిపిన అధ్యయనాల తరువాత ఆర్జీఐ నమూనా రిజిస్ట్రేషన్‌ సిస్టమ్‌(ఎస్‌ఆర్‌ఎస్‌) గతవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం... 2010 వరకు అన్ని వయసు వర్గాల్లో కేరళలో ఆయుర్దాయం ఎక్కువ. ఇప్పుడు కేరళను తోసిరాజని జమ్మూ కశ్మీర్‌ ఆ స్థానాన్ని ఆక్రమించింది. అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్‌ లాంటి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఆయుర్దాయ సమాచారం వెల్లడికాలేదు.

ఈ సర్వేలు కేవలం 21 పెద్ద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకే పరిమితమయ్యాయి. కానీ పుట్టిన సమయంలో సగటున 74.9 ఏళ్లతో కేరళ అత్యధిక ఆయుర్దాయాన్ని కలిగి ఉంది. ఈ విషయంలో 73.2 ఏళ్లతో ఢిల్లీది రెండో స్థానం. జమ్మూ కశ్మీర్‌ మూడో స్థానంలో ఉంది. ఏడాది నుంచి నాలుగేళ్ల చిన్నారుల్లో అతి తక్కువ మరణాలు (దేశం మొత్తం మరణాల్లో 0.1 శాతం) జమ్మూ కశ్మీర్‌లో నమోదవుతున్నాయి.

మరిన్ని వార్తలు