లోయలో జనజీవనం అతలాకుతలం

18 Jul, 2016 02:19 IST|Sakshi
లోయలో జనజీవనం అతలాకుతలం

అందని నిత్యావసర వస్తువులు.. కొనసాగుతున్న కర్ఫ్యూ
- మొబైల్ సేవల నిలిపివేతతో మరిన్ని కష్టాలు.. ఆర్మీక్యాంపు ముట్టడి
- ప్రెస్‌ మూసివేతపై పత్రికల ఆగ్రహం.. ఖండించిన జర్నలిస్టు సంఘాలు
 
 శ్రీనగర్ : కశ్మీర్‌లో వరుసగా పదోరోజూ  కర్ఫ్యూ అమలు, మొబైల్ సేవల నిలిపివేతతో జనజీవనం అస్తవ్యస్తమైంది. బుర్హాన్ వానీ ఎన్‌కౌంటర్‌తో మొదలైన అల్లర్లను అదుపుచేసే క్రమంలో కశ్మీర్‌లోయలో అడుగడుగునా పోలీసులు, భద్రతా బలగాల పహారా కొనసాగుతోంది. నిత్యావసర వస్తువులు కూడా ప్రజలను చేరటం లేదు. సెల్‌ఫోన్స్ పనిచేయకపోవటంతో.. చాలా మంది తమ కుటుంబ సభ్యులను చేరుకోవటం కష్టమవుతోంది. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 39 మంది మరణించగా.. 3,100 మంది గాయపడ్డారు. ఓ వైపు కర్ఫ్యూ కొనసాగుతుండగానే.. శనివారం కుప్వారా జిల్లాలో జరిగిన అల్లర్లలో ఒకరిని చంపినట్లు పోలీసులు వెల్లడించారు. ఆదివారం ఒక అల్లరిమూక బండిపోరా జిల్లాలోని ఆర్మీ క్యాంపును ముట్టడించింది. ఆత్మరక్షణ కోసం భద్రతా దళాలు కాల్పులు జరపగా ముగ్గురు ఆందోళన కారులకు గాయాలయ్యాయి. వదంతులు ప్రచారం కాకుండా.. కశ్మీర్ లోయలో మూడో వంతు ప్రాంతంలో టెలిఫోన్ సర్వీసులను, ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులను వారం పాటు పొడిగించారు.

 రెండో రోజూ పత్రికలు బంద్!
 కశ్మీర్ లోయలో వరుసగా రెండోరోజూ  స్థానిక దినపత్రికలు మార్కెట్‌లోకి విడుదల కాలేదు. శనివారం రాత్రి కొందరు పోలీసులు రెండు ప్రింటింగ్ ప్రెస్‌లపై దాడి చేసి వార్తా పేపర్లలను, న్యూస్ పేపర్ ప్లేట్లను సీజ్ చేశారు. దీనిపై ఎడిటర్లు, ప్రింటర్లు, పబ్లిషర్లు తీవ్రంగా మండిపడ్డారు. కాగా, శనివారం అర్ధరాత్రి తర్వాత అధికారులు కేబుల్ టీవీ ప్రసారాలను పునరుద్ధరించారు. ప్రింటింగ్ ప్రెస్‌లపై దాడుల ఘటనను ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది భావప్రకటనపై దాడి అని ఐజేయూ అధ్యక్ష, జనరల్ సెక్రటరీలు ఎస్‌ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, అంతర్జాతీయ జర్నలిస్ట్ సమాఖ్య ఉపాధ్యక్షుడు సబినా ఇంద్రజిత్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్‌నాథ్, ప్రభాత్‌దష్ అభివర్ణించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీసీఐకి లేఖ రాశారు.

మరిన్ని వార్తలు