ప్రీమియంల చెల్లింపునకు మరో 30 రోజుల వ్యవధి

6 Apr, 2020 05:47 IST|Sakshi

బీమా పాలసీదార్లకు ఐఆర్‌డీఏఐ ఊరట

న్యూఢిల్లీ: కరోనావైరస్‌ కట్టడిపరమైన లాక్‌డౌన్‌ అమలవుతున్న నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు ప్రీమియంల చెల్లింపు విషయంలో వెసులుబాటునిస్తూ బీమా రంగ అభివృద్ధి, నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్‌లో కట్టాల్సిన రెన్యువల్‌ ప్రీమియంలకు సంబంధించి పాలసీదారులకు మరో 30 రోజుల వ్యవధి ఉంటుందని వెల్లడించింది. జీవిత బీమా సంస్థలు, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కౌన్సిల్‌ విజ్ఞప్తుల మేరకు తాజా నిర్ణయం తీసుకుంది.

ఆరోగ్య బీమా, వాహన థర్డ్‌ పార్టీ బీమా పాలసీలకు ఐఆర్‌డీఏఐ ఇప్పటికే ఈ వెసులుబాటు ప్రకటించింది. మార్చి 25 – ఏప్రిల్‌ 14 మధ్య కట్టాల్సిన మోటార్‌ థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియంలను ఏప్రిల్‌ 21లోగా చెల్లించవచ్చని వెసులుబాటు ఇచ్చింది. ఈ వ్యవధిలో రిస్క్‌ కవర్‌ కొనసాగుతుందని పేర్కొంది. మరోవైపు, నియంత్రణ సంస్థకు బీమా రంగ సంస్థలు సమర్పించాల్సిన రిటర్న్స్‌ విషయంలోనూ మరికాస్త వ్యవధినిచ్చింది. నెలవారీ రిటర్న్‌లకు అదనంగా 15 రోజులు, త్రైమాసిక, అర్ధ సంవత్సర, వార్షిక రిటర్నులు సమర్పించేందుకు 30 రోజుల వ్యవధి లభిస్తుంది.

మరిన్ని వార్తలు