లింగాయత్‌లు, వీరశైవులు హిందువుల్లో భాగమే

19 Oct, 2017 16:35 IST|Sakshi

పర్యాయ పెజావర్‌ మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థస్వామి

మంగుళూరు: లింగాయత్‌లలో లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ఉన్నప్పటికీ అవి రెండూ హిందూమతంలో భాగమేనని పర్యాయ పెజావర్‌ మఠం పీఠాధిపతి విశ్వేశతీర్థ స్వామి అన్నారు. కర్ణాటకలోని ఉడిపిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ లింగాయత్, వీరశైవ సంప్రదాయాలు ద్వైత, అద్వైత సిద్ధాంతాల వంటివేనని చెప్పారు. ద్వైత, అద్వైత సిద్ధాంతాల్లో ప్రాథమిక వైరుధ్యాలు ఉన్నప్పటికీ అవి రెండూ వైదిక మతంలో భాగమేనని అలాగే లింగాయత్, వీరశైవం రెండూ వేర్వేరు సంప్రదాయాలు అయినప్పటికీ అవి హిందూ మతం నుంచి భిన్నమైనవి కావన్నారు.

కర్ణాటకలో బలమైన సామాజికవర్గంగా ఉన్న లింగాయత్‌లు 12వ శతాబ్దానికి చెందిన తత్వవేత్త బసవేశ్వరుని అనుసరిస్తుంటారు. లింగాయత్, వీరశైవ సంప్రదాయాలూ ఒకే మతానికి సంబంధించినవని ఇరువర్గాలూ అంగీకరిస్తే వీరశైవ–లింగాయత్‌ కమ్యూనిటీకి మరింత బలం చేకూరుతుందనేది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు. వారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తన ఉద్దేశం కాదని, ఈ అంశంపై ఇరు వర్గాలూ సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు