వైరల్‌ వీడియో.. గడ్డి తింటున్న షేర్‌ ఖాన్‌

29 Aug, 2019 16:06 IST|Sakshi

గాంధీనగర్‌: మృగరాజు సింహం విషయంలో తరచుగా ఓ మాట వింటుంటాం. ఆకలేసినంత మాత్రానా సింహం గడ్డి తినదని. కానీ ఈ వీడియో చూస్తే ఆ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. ఎందుకంటే ఈ సింహం తాపీగా గడ్డి నముల్తుంది కాబట్టి. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. ఈ వింత సంఘటన గిర్‌ అడవుల్లో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. గుజరాత్‌లో గిర్‌ అభయారణ్యంలో ఓ సింహం గడ్డి తింటూ వీడియోకు చిక్కింది. సింహం గడ్డిని నమిలి, బయటకు ఉమ్మేయడం వీడియోలో రికార్డయ్యింది. దాన్ని కాస్త సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇది శాఖహార మృగరాజేమో’.. ‘ఈ సింహం భార్య డైటింగ్‌ చేయమన్నట్లుంది. అందుకే ఇలా గడ్డి తింటుంది’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

అయితే జంతుశాస్త్రం తెలిసిన వారు మాత్రం ఇది అంత ఆశ్చర్యపోవాల్సిన సంఘటనేం కాదు అంటున్నారు. పేగులను శుభ్రం చేసుకోవడానికి గాను సింహాలు ఇలా గడ్డిని తింటాయన్నారు. పిల్లి జాతికి చెందిన అన్ని జీవులు గడ్డిని భేదిమందు(విరేచనాలు)గా సేవిస్తాయన్నారు. సింహం లాంటి మాంసాహార జంతువులు ఓ జీవిని చంపి ఆహారంగా తీసుకున్నప్పుడు.. అది అరగకపోతే ఇలా గడ్డిని తింటాయి. ఆ రసం భేది మందుగా పని చేస్తుంది. అందుకే సింహం గడ్డిని నమిలి.. చివరకు బయటకు ఉమ్మేసింది అని తెలిపారు. దీని గురించి  షెత్రుంజి రేంజ్ ఫారెస్ట్ డిప్యూటీ కన్జర్వేటర్ (డీసీఎఫ్) సందీప్ కుమార్ మాట్లాడుతూ.. సింహాల కడుపులో ఏదైనా ఇబ్బందిగా ఉంటే వాంతులు చేసుకునేందుకు అప్పుడప్పుడు గడ్డి తింటుంటాయని పేర్కొన్నారు. పచ్చిమాంసం కొన్నిసార్లు వాటి జీర్ణక్రియను ఇబ్బంది పెడుతుందని, అటువంటి సమయంలో దానిని మళ్లీ బయటకు పంపేందుకు ఇలా గడ్డి తింటాయని వివరించారు. ఏది ఏమైనా సింహం గడ్డి తినడం నిజంగా చాలా అరుదైన సంఘటనగానే చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు