అన్ని సౌకర్యాలతో ఐఎన్‌ఎస్‌ జలశ్వ

8 May, 2020 17:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలను కేంద్రప్రభుత్వం ముమ్మరం చేసింది. ఈ కార్యక్రమాన్ని మే 1వ తేదీ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. వందేమాతరం విమాన సర్వీసులు ద్వారా కొంత మంది భారతీయులను స్వదేశానికి తీసుకువస్తుండగా మాలే లో చిక్కుకుపోయిన భారతీయులను ఆపరేషన్‌ సముద్రసేతు ద్వారా  ఐఎన్‌ఎస్‌ జలశ్వ నౌక సాయంతో తీసుకురానున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నౌకలో ఏర్పాటు చేసిన పడకలు, ప్రయాణికులకు కల్పించనున్న సౌకర్యాలకు సంబంధించిన వీడియోని రక్షణ మంత్రత్వ శాఖ శుక్రవారం తన ట్వీటర్‌ ఖాతలో పోస్ట్‌ చేసింది. 44 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ఐఎన్‌ఎస్‌ జలష్వ నౌకలో అన్ని ఏర్పాట్లు చేశారు. (తమిళనాడులో కరోనాకి మందు!)

దూరం దూరంగా ఉండే పడకలు, ప్రయాణికులు కోసం పండ్లు, వాటర్‌బాటిల్‌లు ఎవరికి వారికి విడివిడిగా ఏర్పాట్లు చేశారు. బ్లూ కలర్‌ యూనిఫామ్‌ ధరించిన వ్యక్తులు ఈ ఏర్పాట్లును చేస్తున్నారు. నౌక మొత్తాన్ని శానిటైజర్లతో శుభ్రం చేయించారు. అయితే ఈ నౌకలో ప్రయాణించేందుకు ఒక్కొక్కరి నుంచి 40 డాలర్లు వసూలు చేయనున్నారు. వీరందరిని మాలే నుంచి కేరళలోని కొచ్చికి తీసుకువస్తారు. అక్కడి నుంచి వారి ప్రాంతాలకు తరలిస్తారు. మాలే అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతమని అక్కడ కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే అక్కడ ఇంటి నుంచి బయటకు  రావాలంటే భయం వేసేదని  ఒక ప్రయాణీకుడు తెలిపాడు. ఐఎన్‌ఎస్‌ జలశ్వతో పాటు ఐఎన్‌ఎస్‌ మఘర్‌ నౌకను కూడా మాల్డీవుల నుంచి భారతీయులను తీసుకురావడానికి ఉపయోగిస్తున్నారు. మొదటి విడతలో జలశ్వ నౌక ద్వారా 750 మందిని తీసుకురానున్నారు.

మరిన్ని వార్తలు