మళ్లీ అలిగిన అద్వానీ..

4 Apr, 2015 14:15 IST|Sakshi
మళ్లీ అలిగిన అద్వానీ..

బెంగళూరు:  బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు ఎల్కె అద్వానీ మరోసారి అలకబూనారు.  బెంగళూరులో జరుగుతున్న పార్టీ జాతీయ సమావేశాల సందర్భంగా ఆయన అలక పూనినట్టు సమాచారం.  రెండవరోజు సమావేశాల్లో మాట్లాడాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా  చేసిన విజ్ఞప్తిని ఎల్కె అద్వానీ తిరస్కరించినట్టు  తెలుస్తోంది.   పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అద్వానీ మాట్లాడక పోవడం ఇంది రెండవసారి.  గతంలో 2013లో గోవాలో జరిగిన సమావేశాల్లోనరేంద్ర మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా  పార్టీ చేసిన ప్రతిపాదనకు నిరసనగా ఆయన సమావేశాల నుంచి వెళ్లిపోయారు.

మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, కురువృద్దుడు లాల్ కృష్ణ అద్వానీ తాజా సమావేశాల్లో ఒకరికొకరు ఎదురు  పడినా  కనీసం పలకరించుకోలేదట. సమావేశ వేదికపైనా కూడా ఎడమొహం పెడమొహంగానే ఉన్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీని  స్థాపించినప్పటి నుంచీ చురుకైన పాత్ర వహిస్తున్న ఎల్కె అద్వానీ అనతికాలంలోనే అగ్రనేతగా ఎదిగారు. కీలక నేతగా ఆయన పలుమార్లు చక్రం తిప్పారు. అయితే గత సంవత్సరం బీజేపీ అధ్యక్షుడిగా  అమిత్ షా ఎన్నికైన తరువాత పార్టీలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఎనభై ఏళ్ల వయసు సభ్యులు కొనసాగించకూడదంటూ  సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను బీజేపీ  పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించిన విషయం తెలిసిందే.  గత కొంతకాలంగా  పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అద్వానీ  తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అవకాశం దొరికినప్పుడల్లా తన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కారు కూడా.   

ఇక  లోకసభలో ప్రత్యర్థులపై  తన వాక్చాతుర్యం, వాగ్భాణాలతో విరుచుకుపడే అద్వానీ... తాజా పార్లమెంటు  సమావేశాల్లో ఎక్కడా ఆయన స్వరం వినిపించలేదు.  సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరైనా ఒక్కసారి కూడా  అద్వానీ సభలో మాట్లాడకపోవడం,  ఆయన  నిరాసక్తతకు, తీవ్ర అసంతృప్తికి నిదర్శనమని  పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

మరిన్ని వార్తలు