గుడిసెలో ఎమ్మెల్యే.. ఇళ్లు కట్టిస్తున్న స్థానికులు

30 Jan, 2019 11:36 IST|Sakshi
ఎమ్మెల్యే సీతారామ్‌

భోపాల్‌ : ఎన్నికల్లో గెలిపిస్తే ఇది చేస్తాం.. అది చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించే నాయకులను చూశాం. తీరా ఎన్నికల్లో గెలిచిన తరవాత ముఖం చాటేయడం సాధారణమే. కానీ మధ్య ప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యే గుడిసెలో నివసించడాన్ని చూసి చలించిపోయిన స్థానికులు చందాలు వేసుకొని మరి ఇళ్లు కట్టిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి గత నవంబర్‌లో ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే షియోపూర్ జిల్లా విజయ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన 55 ఏళ్ల సీతారామ్ ఆదివాసి.. కాంగ్రెస్ కీలకనేత రామ్‌నివాస్ రావత్‌పై గెలుపొందారు. ఎమ్మెల్యేగా సీతారామ్ ఎన్నిక కావడం ఇదే తొలిసారి. గతంలో రెండు పర్యాయాలు పోటీ చేసి ఓటమి చవిచూసిన సీతారామ్.. మూడోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో రెండు సార్లు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా.. ఒకసారి స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు.  

ఎమ్మెల్యేగా గెలిచినా సీతరామ్‌ను ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి. ఇంటి అద్దే కట్టే స్థోమత లేక భార్యతో కలిసి పూరిగుడిసెలో నివాసం ఉంటున్నారు. ఇప్పటివరకూ తొలి జీతం అందుకోలేదు. తనకు వచ్చే రూ.లక్షా పదివేల జీతం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తమ ఎమ్మెల్యే పూరి గుడిసెలో ఉండటం తమకు అవమానమని భావించిన స్థానికులు చందాలు వేసుకుని మరి ఆయనకు ఇల్లు కటిస్తున్నారు. ఈ విషయంపై ధన్‌రాజ్ అనే నియోజకవర్గ స్థానికుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యే కష్టకాలంలో కూడా మాకు అండగా ఉన్నారు. ఆయన స్వభావం మాకు తెలుసు. ఆయనేమో ఇంకా గుడిసెలో ఉంటున్నారు. అందుకే చందాలు వేసుకుని ఆయనకు కనీసం రెండు గదులు ఉండే ఇల్లు నిర్మిస్తున్నామని’ తెలిపాడు.

తొలి జీతం నా నియోజక వర్గ ప్రజలకే..
నియోజకవర్గ ప్రజలు ఇళ్లు కట్టిస్తుండటంపై ఎమ్మెల్యే సీతారామ్‌ స్పందించారు. ‘నా నియోజకవర్గ ప్రజలు నాకు రూ.100, రూ.1000 విరాళాలిచ్చి ఇళ్లు కట్టిస్తున్నారు. మాది చాలా పేద కుటుంబం. ఇటీవల ఎన్నికల్లో నెగ్గిన అనంతరం చిల్లర నాణేలతో నియోజకవర్గ ప్రజలు తూలాభారం వేశారు. ఆ డబ్బుతో గుడిసె కట్టుకున్నా. ఇప్పుడు వారే చందాలు వేసుకుని ఇల్లు కట్టిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.  నా తొలి జీతాన్ని నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసమే ఖర్చుచేస్తాను’  అని సీతారమ్‌ తన ఉదారతను చాటుకున్నారు. ఇక సీతారామ్‌ సతీమణి ఇమార్తి భాయ్‌ మాట్లాడుతూ.. విజయ్‌పూర్‌ ప్రజలు తన భర్తపై ప్రేమను చూపిస్తారని, అతను వారి సమస్యలపై నిరంతరం పోరాడుతారని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎమ్మెల్యే.. ఐదు లక్షల విలువ చేసే 2 ఎకరాల భూమి, 600 గజాల ఇంటి స్థలం, రూ. 46,733 నగదే తన ఆస్తులని ఎన్నికల అఫడవిట్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు