విద్యుత్ అధికారులపై స్థానికుల దాడి..

12 Oct, 2016 14:25 IST|Sakshi

జైసాల్మేర్ః విద్యుత్ విజిలెన్స్ టీమ్ పై స్థానికులు దాడికి దిగిన ఘటన జైసాల్మేర్ సమీప గ్రామంలో చోటు చేసుకుంది. జిల్లాలో అక్రమంగా విద్యుత్ చోరీ జరుగుతోందన్నసమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు గ్రామంలో తనిఖీలు చేపట్టేందుకు వెళ్ళారు. దీంతో అధికారులను చూసి ఆగ్రహించిన గ్రామస్థులు వారిపై దాడికి దిగినట్లు పోలీసులు తెలిపారు.

రాజస్థాన్ జైసాల్మేర్ సమీపంలోని కిరాడియా గ్రామంలో విద్యుత్తును భారీగా దొంగిలిస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో కొంతమంది అధికారుల బృందం కిరాడియా గ్రామంలో తనిఖీలకు వెళ్ళింది. ఫోర్ ట్యూబ్ కరెంటు బావుల్లో మరో ట్యూబ్ ను కనెక్ట్ చేసి మరీ గ్రామస్థులు కరెంటు దోపిడీకి పాల్పడుతున్నట్లుగా తనిఖీల్లో అధికారులు గమనించారు.  అయితే తనిఖీలకు వచ్చిన అధికారులను చూసి ఆగ్రహించిన గ్రామస్థులు వారిపై దాడికి దిగారు. దాడుల్లో జూనియర్ ఇంజనీర్ ధనరామ్, సాంకేతిక సహాయకులు జగతారామ్, విక్రమ్ భదులు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. వారిని చికిత్సకోసం స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేర్పించినట్లు చెప్పారు. అయితే పోలీసుల నిర్లక్ష్యమే ఘటనకు దారి తీసిందని చికిత్స పొందుతున్న బాధితులు ఆరోపిస్తున్నారు. మరోవైపు దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని,  నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు