బిహార్‌లో కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు

7 Sep, 2016 17:04 IST|Sakshi
బిహార్‌లో కూడా చెట్టుకు కట్టేసి కొట్టారు

న్యూఢిల్లీ: యూపీ, గుజరాత్ రాష్ట్రాల్లో గోవులను కబేళాలకు తరలిస్తున్నారనే ఆరోపణలతో గోసంరక్షకులు చట్టాలను చేతుల్లోకి నిందితులను కట్టేసి చితక్కొడుతుండగా, అదే బాటలో బిహార్ ప్రజలు చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. బిహార్‌లో మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారన్న ఆరోపణలపై నిందితులను చావుదెబ్బలుకొడుతున్నారు. అప్పుడప్పుడు ఇలాంటి వార్తలు వినిపిస్తున్నా దానికి సంబంధించిన వీడియో మాత్రం మీడియాకు చిక్కడం ఇదే తొలిసారి.

బిహార్‌లోని చాప్రా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సైకిల్ మోటార్‌పై వెళుతున్న ఓ యువకుడిని పట్టుకొని మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడనే ఆరోపణలతో అతడిని చెట్టుకు కట్టేసి చేతులతో, కర్రలతో నలుగురైదుగురు చితకబాదారు. బిహార్ ప్రభుత్వం రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించిన తర్వాత ఇలాంటి సంఘటన వెలుగులోకి రావడం ఇదే మొదటిసారి. గోరక్షకుల దాడులపై దేశవ్యాప్తంగా గగ్గోలు ఎత్తడంతో 'కొట్టండికానీ ఎముకలిరిగేలా కాదు. కొట్టండికానీ వీడియోలు తీయకండి' అని విశ్వహిందూ పరిషత్ నాయకులు గోసంరక్షకులకు ఇచ్చిన పిలుపు ఇంకా బిహార్కు చేరినట్లు లేదు. ఎవరో ఈ దాడిని వీడియో తీసి మరీ పోస్ట్ చేశారు.

మరిన్ని వార్తలు