జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు

30 May, 2020 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన నాలుగో విడత లాక్‌డౌన్  రేపటితో (ఆదివారం)  ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతున్నా.. లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులను కల్పించింది. వివిధ రాష్ట్రాల నుంచి సేకరించిన నివేదికలను ఆధారంగా చేసుకుని కంటైన్‌మెంట్‌ జోన్లలో జూన్‌ 30 వరకు లాక్‌డౌన్‌ను పొడిగింది. జూన్‌ 8 నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రార్థనా మందిరాలు తెరుచుకోవచ్చని తెలిపింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు హోటల్స్‌, రెస్టారెంట్లు, మాల్స్‌ తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. కరోనా విజృంభన వ్యాప్తి కొనసాగుతున్న తరుణంలో జూలై నుంచి పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్‌ సెంటర్లు ప్రారంభం అవుతాయని కేంద్రం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు శనివారం సాయంత్రం లాక్‌డౌన్‌ 5.0 కి సంబంధించి కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. (కరోనా వైద్య పరీక్షల్లో తేలిందేమిటి?)

రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ
లాక్‌డౌక్‌ నేపథ్యంలో రెండు నెలలుగా మూతబడ్డ అంతర్జాతీయ విమాన సర్వీసులు, మెట్రో రైళ్లు, సినిమా హాల్స్‌, జిమ్‌లు, బార్లు, స్విమ్మింగ్ పూల్స్‌, ఆడిటోరియంల ప్రారంభంపై త్వరలోనే తేదీలను ప్రకటిస్తామని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. అలాగే రాజకీయ, సామాజిక, సాంస్కృతిక మతపరమైన కార్యకలాపాలపై కూడా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని తెలిపింది. కర్ఫ్యూను రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కుదించింది. ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడికి అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు, భౌతికదూరం తప్పనిసరి చేస్తున్నట్లు నూతన మార్గదర్శకాల్లో కేంద్రం స్పష్టం చేసింది. ఇక అంతరాష్ట్ర రవాణాపై నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే ఇరు రాష్ట్రాల ఒప్పందంతోనే ప్రయాణాలు కొనసాగించాలని తెలిపింది. (ఒక్క రోజే 7,964 కరోనా కేసులు)

>
మరిన్ని వార్తలు