వారి పరిస్థితి మరీ దుర్భరం

21 Apr, 2020 13:54 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘తాను శవమై ఒకరికి వశమై, తనువు పుండై ఒకరికి పండై, ఎప్పటికీ ఎడారై ఎందరికో ఓయాసిస్‌....’ అయ్యేది వేశ్య అంటూ ఓ దివంగత కవి నాలుగు ముక్కల్లో వేశ్యల దుర్భర జీవితాన్ని కళ్ల ముందు ఆవిష్కరించారు. ఇప్పుడు కరోనా వైరస్‌ ప్రభావంతో వారి జీవితాలు పూర్తిగా బుగ్గవుతున్నాయి. చీకటి రాత్రులకు పరిమితమయ్యే వారి జీవితాల జీర్ణకోశ బాధలను తీర్చేందుకు ఎవరు ముందుకు రావడం లేదు. సామాజికంగా వెలివేతకు గురవుతున్న వేశ్యలకింత అన్నదానం చేయడానికి దాతలెవరూ ముందుకు రావడం లేదు. ‘మాకు తిండిలేక పోయినా పర్వాలేదు. మా పిల్లలకింత తిండి పెట్టండి’ అంటూ దారిన పోతున్న వారికి దండాలు పెడుతూ వేడుకున్నా కనికరించే వారు కాన రావడం లేదు. (కరోనా నుంచి బయటపడినా..)

పైగా వేశ్యల వద్దకు వెళితే కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉందని వారికి అంతో ఇంతో సహాయం అందించే సామాజిక కార్యకర్తలు కూడా మొహం చాటేస్తుండడం వారు మరీ భరించలేక పోతున్నారు. ఇదీ ఢిల్లీ నజాఫ్‌గడ్‌లోని రెడ్‌లైట్‌ ఏరియా వేశ్యల పరిస్థితి. ‘ఇంట్లో నలుగురు పెద్దాళ్లం ఉన్నాం. 20 రూపాయలు పెట్టి కిలో గోధుమ పిండి కొని తెచ్చాం. కూరగాయల కొరత ఉంది. టమోటా, మిరప కాయలుండగా, గోధమ రొట్టే పిల్లల తిండికే అయిపోయింది. నాకు రేషన్‌ కార్డు ఉంది. రేషన్‌ తెచ్చాను. అప్పుడే అయిపోయింది. అన్నం పంచేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మేము ఎక్కడికి వెళ్లడం లేదు. తిండీ లేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఆకలితో చస్తున్నాం’ సీమా అనే ఇద్దరు పిల్లల తల్లి వాపోయింది. సెక్స్‌ వర్కర్లంతా దినసరి ఆదాయంపై బతికేవారే. లాక్‌డౌన్‌ ప్రకటించిన మార్చి 24వ తేదీ నుంచి వారి వద్దకు విటులెవరూ రావడం లేదు. 


కోల్‌కతాలోని కాళీఘాట్‌లో నివసిస్తున్న వేశ్యల పరిస్థితి కూడా ఇలాగే దుర్భరంగా ఉందని ఆ ప్రాంతంలో ‘న్యూ లైట్‌’ చారిటీ సంస్థ పేరిట సామాజిక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోన్న ఊర్మి బసు తెలిపారు. సాధారణంగా రెడ్‌ లైట్‌ ఏరియాలు చాలా కిక్కిర్సి ఉంటాయి. ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలోని ఏరియాలు అలాగే ఉన్నాయి. తలకు, కాళ్లకు తగిలే ఇరుకు గదుల్లో నలుగురైదుగురు చొప్పున నివసిస్తారు. అక్కడి వారికి సామాజిక దూరం పాటించడం అసలు కుదరదు. ఆ ప్రాంతాల్లో ఒక్క కరోనా కేసు వచ్చిందంటే అది దావాగ్నిలా వ్యాపిస్తుంది. అందుకుని ఆ ప్రాంతంలోకి వెళ్లి అన్నపానీయాలు అందించేందుకు సామాజిక కార్యకర్తలు కూడా జంకుతున్నారు. వాళ్లను కూడా వారి ప్రాంతం దాటి బయటకు రావడానికి ఎవరూ అనుమతించడం లేదు. బస్తడు బియ్యం, పప్పు, ఉప్పుల కోసం తన నగలను అమ్మేశానని బీహార్‌లోని రెడ్‌లైట్‌ ఏరియాకు చెందిన ఫాతిమా కాటూన్‌ తెలిపారు. (డ్యాన్సులు చేసిన క‌రోనా పేషెంట్లు)

రెడ్‌లైట్‌ ఏరియాల్లో చాలా మందికి రేషన్‌ కార్డులు లేవు. ‘అలాంటి వారిని కూడా ఆదుకుంటామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంతవరకు ఎలాంటి సాయం అందలేదు’ అని ముంబై ప్రాంతంలోని వ్యభిచార కూపం నుంచి వేశ్యలకు విముక్తి కల్పించేందుకు కృషి చేస్తోన్న ‘ప్రేరణ’ సంస్థ నాయకులు కశీన కరీమ్‌ చెప్పారు. ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి ఉచితంగా రేషన్‌ సరకులు పంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని, వాటి కోసం ఇప్పటికీ ప్రజలు నిరీక్షిస్తున్నారని ఆమె తెలిపారు. (కరోనా : 24 గంటల్లో 47 మంది మృతి)

మరిన్ని వార్తలు