ఆమె లేకుండా ఇంట్లో పని చేయగలరా!

28 May, 2020 10:06 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌... ఈ పేరు ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఎన్నో లక్షల కుటుంబాలకు జీవనోపాధి లేకుండా చేసింది. రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. పనులు లేక  వలస వచ్చిన ప్రాంతంలో ఉండలేక సొంత ఊర్లకు తిరుగుబాట పడుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అత్యవసర సేవలు మినహా దాదాపు అన్ని సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అనేక రంగాలలోని వారికి పూట గడవడమే కష్టంగా మారింది. ఎవరిని కదిపినా కన్నీటి గాథలే వినిపిస్తున్నాయి. (ఔను లాక్‌డౌన్‌లో ప్రజలు మారారు..! ) 

లాక్‌డౌన్‌తో కష్టాల పాలైన వారిలో తొలి స్థానంలో ఇంట్లో పనిచేసే వారు కూడా ఉన్నారు. పని మనుషులు లేనిదే చాలామందికి రోజు గడవడం అసాధ్యం. వీళ్లు మన జీవితాలను ఎంతో సులభతరం చేస్తున్నారు. ఉదయం లేస్తే ఇల్లు ఊడవటం నుంచి వంట చేయడం వరకు దాదాపు అన్ని పనులు వాళ్లే చేయాలి. లాక్‌డౌన్‌తో వీరు సైతం ఇంటి నుంచి బయటకు రాకుండా పోవడంతో సెలబ్రిటీలు కూడా ఇంట్లో నానా తంటాలు పడుతున్నారు. కరోనా వ్యాపిస్తుండటంతో వీరిని పిలవాలా? వద్దా అని చాలా మంది సంకోచిస్తున్నారు. చేసేదేం లేక ఇంటి పనులన్నీ తామే స‍్వయంగా చేసుకుంటారు. దీంతో పనిమనుషులు లేని లోటు, వాళ్ల సేవల విలువ మరింత తెలిసొచ్చింది. ఇటీవల లాక్‌డౌన్‌ సడలింపులతో కొంత మంది తిరిగి తమ పనులకు వెళుతున్నారు. కానీ ఎక్కువ కుటుంబాల్లో పని చేయడానికి అనుమతించడం లేదు. కేవలం ఒక వ్యక్తి ఒక ఇంటిలోనే పని చేయడానికి వీలవుతుంది. (భోజనం కోసం ప్రతిరోజూ 25 కిలోమీటర్లు.. )

కరోనా వైరస్‌ ధాటికి తమిళనాడులో ఎక్కువ ప్రభావితమైంది చెన్నై. ఇక్కడ 11 వేల కేసులు నమోదయ్యాయి. దీని కారణంగా చెన్నైలో ఎక్కువ సడలింపులు ఇవ్వలేదు. మహమ్మారి సంక్షోభం​ కారణంగా చెన్నైలో డొమెస్టిక్‌ వర్కర్ 46 ఏళ్ల ఈశ్వరి చాలా రోజులుగా పనికి వెళ్లలేదు. ఆమె అయిదు ఇళ్లల్లో గృహ సహాయకురాలుగా పని చేస్తోంది. సడలింపులతో ఆమె తిరిగి తన పనిని ప్రారంభించింది. అయితే ఒక కుటుంబం మాత్రమే ఆమెను వారి ఇంట్లోకి అనుమతించడానికి సిద్ధంగా ఉంది.

ఈ విషయంపై ఈశ్వరి మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ మహమ్మారి కారణంగా నా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవాళ్లకు ఇప్పుడు పని లేదు. నేను మాత్రమే సంపాదిస్తున్నాను, నేను పనిచేసే అయిదు ఇళ్ళలో  ఒక ఇల్లు మాత్రమే నన్ను తిరిగి పని చేయడానికి అనుమతించింది. మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. నేను మహిళల సంక్షేమ పథకం నుంచి రుణం కోసం దరఖాస్తు చేసాను. కానీ దాని నుంచి ఎలాంటి స్పందన లేదు’. అంటూ తన కన్నీటిని తుడుచుకుంటూ ఈశ్వరి తన ఆవేదనను వెలిబుచ్చింది. 

ఈశ్వరి పని చేయడానికి అంగీకరించిన ఇంటి యజమాని లతా మాట్లాడుతూ.. ‘ఇది పరీక్షా కాలం. మనందరం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. ఇంట్లో పనిచేసే వాళ్లు కూడా మనుషులే. లాక్‌డౌన్ సమయంలో కూడా మేము వారికి జీతాలు చెల్లిస్తున్నాము. ఆమె తన పనిని తిరిగి ప్రారంభించాలనుకుంది. అందుకు నేను అంగీకరించాను. ఇంట్లోకి వచ్చే ముందు ఆమె తీసుకోవలసిన అన్ని జాగ్రత్తలను నేను తనకు వివరించాను. మాస్కులు ధరించి వస్తుంది. అలాగే ఇంట్లోకి వచ్చే ముందు చేతులు, కాళ్లను శుభ్రంగా కడుక్కొని వస్తుంది.  ఇది కరోనా కాలం అందుకు నేను అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని తెలిపారు.(ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద బాలకృష్ణ నివాళి )

అనేక ఇండిపెండెంట్‌ ఇల్లు కలిగిన వారు కూడా ఇంటి సహాయకురాలిని తిరిగి పనికి అనుమతించడం ప్రారంభించారు. రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో పరిస్థితులు అలా లేవు. హౌసింగ్ సొసైటీల్లో సాధారణంగా కనీసం 300 నుంచి 400 మంది వరకు ఉంటారు. కాబట్టి సహాయకురాలిని అనుమతించే ముందు వారికి సరైన అనుకూల వాతావరణం కల్పించాల్సిన బాధ్యత రెసిడెంట్ వెల్ఫేర్‌ అసోసియేషన్‌దే.

‘సహాయకురాలిని  పని ప్రారంభించడానికి మేము ఇంకా అనుమతించలేదు. చెన్నైలో కేసులు రోజువారీగా పెరుగుతున్నాయి. ఈ సమయలో బయట నుంచి ప్రజలు లోపలికి అనుమతించడం అంత సురక్షితం కాదనిపిస్తుంది. వాళ్లు ఎక్కడి నుంచి వస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి, మేము ఇక్కడ అత్యవసర, అవసరమైన సిబ్బందిని మాత్రమే అనుమతిస్తున్నాము. ప్రమాదం ఉన్న కాలంలో పనికి వచ్చే సిబ్బందికి మేము వారి జీతంలో 25 శాతం ప్రోత్సాహకంగా చెల్లిస్తున్నాము’ అని ఇంపీరియల్ టవర్ అసోసియేషన్ కార్యదర్శి ప్రసానా చార్లెస్ చెప్పారు. (కరోనా బాధితురాలికి కవల పిల్లలు )

ఫెడరేషన్ ఆఫ్ ఒఎంఆర్ రెసిడెంట్స్ అసోసియేషన్ (ఫోమ్రా) కోఆర్డినేటర్ హర్ష కోడా మాట్లాడుతూ: ‘చాలా మంది వృద్ధులకు నర్సులు, అత్యవసర సహాయం వంటివి అవసరం. ఈ డిమాండ్లను పరిశీలించి పని చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము పని మనుషులను వారి టెంపరేచర్‌ పరీక్షించడం, చేతులు, కాళ్లు శుభ్ర పరుచుకున్న తర్వాతే  అపార్ట్‌మెంట్‌లోకి అనుమతిస్తాం. ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మా హౌస్‌హెల్పర్స్‌ను పంపిస్తున్నారు. వారికి క్రమం తప్పకుండా జీతం చెల్లిస్తున్నాం.’ అని తెలిపారు.

చివరగా ఒక్క మాట.. కరోనావైరస్ సంక్షోభం నుంచి ఇప్పట్లో ఉపశమనం పొందేలా లేము. కావున అవసరమైన అన్ని జాగ్రత్తలను పాటిస్తూ ముందుకు సాగాల్సిందే. ఎల్లప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలి. భౌతిక దూరం పాటించండి. బహిరంగ ప్రదేశాల్లోకి వెళ్లినప్పుడు తప్పని సరిగా మాస్కులు ధరిద్దాం. మన చుట్టు పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకుందా. హెల్తీ ఆహరం తీసుకుందాం. కరోనాకు వ్యతిరేకంగా పోరాడి గెలుద్దాం.

మరిన్ని వార్తలు