‘లాక్‌డౌన్‌ ఎత్తివేత’.. హిందీ రాకనే ఈ తప్పిదం

2 Apr, 2020 15:45 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా నేపథ్యంలో దేశంలో విధించిన లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 15న ఎత్తివేస్తారంటూ అరుణాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి పేమాఖండూ చేసిన ట్వీట్‌ నిమిషాల వ్యవధిలోనే వైరల్‌ అయింది. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశం అనంతరం పేమాఖండూ పై విధంగా ట్వీట్‌ చేశారు. అయితే లాక్‌డౌన్‌ ఎత్తివేతపై సీఎం చేసిన ట్వీట్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే కాసేపటి తర్వాత ట్వీట్‌లో దొర్లిన తప్పును గమనించిన సీఎం వెంటనే ఆ పోస్ట్‌ను తొలగించారు. 

ఈ సందర్భంగా ఆ ట్వీట్‌పై పేమాఖండూ వివరణ కూడా ఇచ్చారు. లాక్‌డౌన్‌కు సంబంధించి ట్వీట్‌ చేసిన అధికారికి హిందీ సరిగా రాకపోవడంతో ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్న సీఎం.. వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించినట్లు పేర్కొన్నారు. ‘ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం మా అధికారికి లాక్‌డౌన్‌ గురించి హిందీలో వివరించాను. అయితే ఆయనకు హిందీ సరిగ్గా రాకపోవడంతో ఆయన ఆ విధంగా ట్వీట్‌ చేశారు. దీంతో ఈ సమస్య తలెత్తింది. ఇక లాక్‌డౌన్‌ ఎప్పుడు ఎత్తివేస్తారనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేము. అయితే లాక్‌డౌన్‌లోనూ, ఆతర్వాత కూడా ప్రజలు సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత, ముఖానికి మాస్క్‌లు ధరించడం వంటివి కొనసాగించాలని’ సీఎం పేమాఖండు విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు