లాక్‌డౌన్‌పై నిరసన.. పోలీసుల లాఠీచార్జ్‌!

14 Apr, 2020 18:51 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ పొడిగింపును నిరసిస్తూ ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో వేలాది వలస కార్మికులు భారీ ప్రదర్శనకు యత్నించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు సామాజిక దూరం సూచనల్ని పక్కనబెట్టి మంగళవారం మధ్యాహ్నం గుంపులుగా రోడ్లపైకొచ్చారు. అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ రోడ్లపైకి రావొద్దని, అక్కడ నుంచి వెళ్లిపోవాలని పోలీసులు హెచ్చరించారు. వారి మాటల్ని నిరసనకారులు లెక్కచేయకపోడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో ఎక్కడివారక్కడ పరుగులు పెట్టారు. ఈ వీడియో సంచలనమైంది.
(చదవండి: క్వారంటైన్‌ సెంటర్‌గా మార్చొద్దంటూ దాడి!)

కాగా, దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేటి ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే సరైన నిర్ణయమని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా కేసులు లేని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 నుంచి లాక్‌డౌన్‌ అమల్లో కొన్ని సడలింపులు ఉంటాయని తెలిపారు. అయితే, రోజూ కూలీ చేసుకుని బతికే తాము తిండిలేక చస్తున్నామని వలస కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇళ్లకు వెళ్లేందుకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

ఇక మంగళవారం సాయంత్రం నాటికి కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం..  దేశంలో కోవిడ్‌ కేసుల సంఖ్య 10,815 కు చేరగా.. 1189 మంది కోలుకున్నారు. 353 మరణాలు సంభవించాయి. యాక్టివ్‌ కేసుల సంఖ్య 9272గా ఉంది. 2337 కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా.. కేవలం ముంబై నగరంలోనే 1500 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రవ్యాప్తంగా కోవిడ్‌తో 160 మంది మరణించగా..  229 మంది కోలుకున్నారు.
(వైరల్‌: సీతాపహరణం చూస్తున్న ‘రావణుడు’!)

మరిన్ని వార్తలు