లాక్‌డౌన్‌: భార్యలపై భర్తల ప్రతాపం..

31 Mar, 2020 20:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: మనదేశంలో కరోనా బాధితులతో పాటు గృహహింస కేసులు పెరిగిపోతున్నాయి. మార్చి 24 దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నాటి నుంచి మహిళలపై గృహహింస ఎక్కువయినట్టు జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) వెల్లడించింది. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉంటున్న భర్తలు నిరాశతో తమ ప్రతాపాన్ని భార్యలపై చూపిస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మార్చి 23 నుంచి 30 వరకు 58 ఫిర్యాదులు అందినట్టు తెలిపింది. వీటిలో ఎక్కువగా ఉత్తర భారత్‌ నుంచి రాగా, పంజాబ్‌ నుంచి అధికంగా వచ్చాయని ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తెలిపారు.

‘గృహ హింస ఫిర్యాదులు సంఖ్య పెరిగింది. పని లేకుండా ఇంట్లో గడపాల్సి రావడంతో పురుషులు నిరాశకు గురవుతున్నారు. తమ నిరాశను మహిళలపై చూపిస్తున్నారు. ఈ ట్రెండ్‌ పంజాబ్‌లో ఎక్కువగా ఉన్నట్టు కనబడుతోంది. ఎందుకంటే పంజాబ్‌ నుంచి మాకు ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయ’ని రేఖా శర్మ వివరించారు. అయితే పంజాబ్‌ నుంచి ఎన్ని ఫిర్యాదులు వచ్చాయనేది వెంటనే వెల్లడి కాలేదు. (పరిమళించిన మానవత్వం)

ఫోన్లు కూడా చేస్తున్నారు
తమకు అందిన 58 ఫిర్యాదులు ఈ-మెయిల్‌ వచ్చాయని రేఖా శర్మ చెప్పారు. మొత్తం ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముందన్నారు. సమాజంలో దిగువ శ్రేణిలోని మహిళల నుంచి పోస్ట్‌ ద్వారా ఎక్కువ ఫిర్యాదులు వచ్చినందున వాస్తవ సంఖ్య అధికంగానే ఉండొచ్చని చెప్పారు. గృహ హింస ఎదుర్కొంటున్న చాలా మంది మహిళలకు ఈ-మెయిల్‌ పంపించడం తెలియక పోస్ట్‌ ద్వారా ఫిర్యాదులు పంపిస్తున్నారని తెలిపారు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో పోస్టు ద్వారా వచ్చే ఫిర్యాదులు కూడా తగ్గాయన్నారు. గృహహింస ఫిర్యాదులు తమకు కూడా ఎక్కువగా వస్తున్నాయని రాష్ట్రాల మహిళా కమిషన్లు తెలిపాయని చెప్పారు. గృహహింస ఎదుర్కొంటున్న మహిళలు.. పోలీసులను లేదా రాష్ట్ర మహిళా కమిషన్లను సంప్రదించాలని సూచించారు. బాధితురాళ్ల నుంచి పెద్ద సంఖ్యలో తమకు ఫోన్లు వస్తున్నాయని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. కాగా, గృహ హింసకు సంబంధించి ఎన్‌సీడబ్ల్యూకు మార్చి 23 వరకు ఈ-మెయిల్‌ ద్వారా 291 ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరిలో 302, జనవరిలో 270 ఫిర్యాదులు అందాయి. 

కాపాడమంటూ వేడుకున్న తండ్రి
కూతురు, అల్లుడు బారి నుంచి తనను కాపాడాలంటూ రాజస్థాన్‌లోని సికార్‌ ప్రాంతం నుంచి ఓ తండ్రి తమను అభ్యర్థించాడని రేఖా శర్మ వెల్లడించారు. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి అన్నం పెట్టకుండా తనను కూతురు వేధిస్తోందని ఆయన ‘పీటీఐ’కి తన గోడు వెల్లబోసుకున్నారు. ఆయన అల్లుడు టీచర్‌గా పనిచేస్తుండటం గమనార్హం. (కరోనా: తప్పిన పెనుముప్పు!)

మరిన్ని వార్తలు