భారత్‌లో 5.8 లక్షల ప్రాణాలకు ముప్పు!

29 May, 2020 13:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసులకు ప్రాధాన్యత ఇవ్వడం కోసం అత్యవసరం కాని అన్ని ఎలక్టివ్‌ సర్జరీలను మార్చి 31వ తేదీ వరకు వాయిదా వేయాలంటూ కేంద్ర ప్రభుత్వం మార్చి 20వ తేదీన దేశంలోని ఆస్పత్రులకు, వైద్య సంస్థలకు సూచనలు జారీ చేసింది. మార్చి 20వ తేదీ వరకే కాకుండా నేటి వరకు కూడా దేశంలో కరోనా కేసుల తీవ్రత తగ్గక పోవడంతో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, వైద్య సంస్థలు అత్యవసరం కాని సర్జరీ కేసులను వాయిదా వేస్తూనే వస్తున్నాయి. మే 31వ తేదీ నాటికి నాలుగవ దశ లాక్‌డౌన్‌ కొనసాగుతుంది. ఐదవ దశ లాక్‌డౌన్‌ను విధిస్తారా, లేదా? అన్న విషయంతో ప్రస్తుతానికి స్పష్టత లేదు. 

లాక్‌డౌన్‌ను పొడిగించినా, లేకపోయిన వాయిదా వేస్తూ వస్తోన్న సర్జరీలను వెంటనే అనుమతించక పోయినట్లయితే వారిలో ఎంతో మంది మరణించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో ఇప్పటి వరకు 5.8 లక్షల ఎలక్టివ్‌ సర్జరీలను వాయిదా వేసినట్లు వైద్య వర్గాలు తెలియజేస్తున్నాయి. ఎలక్టివ్‌ సర్జరీలో ఎలక్టివ్‌ అనే ఆంగ్లపదం ‘ఎలిగెరి’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఎలిగెరి అంటే ఎంపిక చేసిన అని అర్థం. ఎలక్టివ్‌ సర్జరీలంటే అత్యవసరం కాకపోయినప్పటికీ సర్జరీ ద్వారా ప్రాణాలను కాపాడాల్సిన కేసులే. ఈ సర్జరీలను ఆస్పత్రుల్లోని సౌకర్యాలు, రోగుల పరిస్థితిని దష్టిలో పెట్టుకొని ఎప్పుడు సర్జరీ చేయాలో ముందుగానే నిర్ధారిస్తారు. వాటి కోవలోకి హెర్నియా, అపెండిక్స్, కిడ్నీ, గాల్‌ బ్లాడర్‌ సర్జరీలను వాయిదా వేయవచ్చు. అయితే మరింత ఆలస్యమైతే రోగుల పరిస్థితి దుర్భరం అవుతుంది.

► కార్డియాక్‌ సర్జరీలు : యాంజీయోగ్రాఫీ లేదా స్టెంట్లు వేయడానికి ముందుగానే ముందుగానే తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. కొన్ని నెలలు ఆలస్యమైతే రోగి ప్రాణాలే పోవచ్చు.
► క్యాన్సర్‌ : మొదట్లోనే గుర్తించి సర్జరీ చేస్తే నయం అవుతుంది. ఆలస్యం అయినకొద్దీ ముదిరి ప్రాణం మీదకు తెస్తుంది.
► మధుమేహ రోగులకు అయిన గాయాలకు, ఇన్‌ఫెక్షన్లకు సకాలంలో వైద్య  పోయినట్లయితే ఇన్‌ఫెక్షన్లు తీవ్రమై శరీర అవయవాలను తొలగించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

మే 18వ తేదీ నాటికి దేశంలో 5,05,800 అత్యవసరం కాని సర్జరీలు, 51,100 క్యాన్సర్‌ సర్జరీలు, 27,700 ఆబ్‌స్టెరిక్‌ సర్జరీలు (స్త్రీల అంగం, అండాశయం, గర్భాశ్రయంకు సంబంధించిన) పెండింగ్‌లో ఉన్నట్లు వైద్య వర్గాల ద్వారా తెల్సింది. ‘బ్రిటిష్‌ జర్నల్‌ ఆఫ్‌ సర్జరీ’ కూడా దాదాపు ఇంతే సంఖ్యను మే 12వ తేదీన వెల్లడించింది. భారత ప్రభుత్వం సూచనల ప్రకారం మొదటి వారంలో 48,725 సర్జరీలు వాయిదా పడ్డాయని, ఆ లెక్కన 12 వారాలకు(దాదాపు మూడు నెలల కాలానికి) 5,85,000 సర్జరీలు వాయిదా పడి ఉంటాయని ఆ పత్రిక పేర్కొంది. అలా ప్రపంచవ్యాప్తంగా 2.84 కోట్ల సర్జరీలు వాయిదా పడి ఉంటాయని అంచనా వేసింది. (చదవండి : ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన)

కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్రలో ఎలక్టివ్‌ సర్జరీలు ఎక్కువగా వాయిదా పడ్డాయి. ఇలాంటి కేసుల విషయంలో అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం వచ్చిందని, ఆలస్యం చేసినట్లయితే రోగుల అవయవాలు దెబ్బతింటాయని, తద్వారా వారి ప్రాణాలకు కూడా ముప్పుందని ముంబైలోని ‘టీఎన్‌ మెడికల్‌ కాలేజ్‌ అండ్‌ బీవైఎల్‌ నాయర్‌ ఆస్పటల్‌’ సర్జరీ విభాగం అధిపతి, ‘మహారాష్ట్ర చాప్టర్‌ ఆఫ్‌ ది అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా’ కార్యదర్శి సతీష్‌ ధారప్‌ హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు