లాక్‌డౌన్‌: తగ్గిన డెంగ్యూ, మలేరియా కేసులు

8 Jun, 2020 08:53 IST|Sakshi

ముంబై: కోవిడ్ -19 లాక్‌డౌన్ కారణంగా.. నగరంలో డెంగ్యూ, మలేరియా, కుష్టు వ్యాధి కేసులు గత ఐదేళ్లలో ఇదే కాలంతో పోలిస్తే.. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో 54 శాతం తగ్గాయని బృహన్‌ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎమ్‌సీ) వెల్లడించింది. వర్షాకాలం ముందు లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో ఈ ఏడాది బీఎమ్‌సీ పరిధిలో చేపట్టే వ్యాధి నియంత్రణ చర్యలను ప్రభావితం చేస్తుందనే ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే గత ఐదేళ్ళతో పోల్చితే.. ఈ సంవత్సరం మే వరకు.. ముంబైలో దోమల ద్వారా కలిగే వ్యాధులు అత్యల్ప సంఖ్యలో నమోదయ్యాయని డాటా చూపిస్తుంది. 2016 జనవరి నుంచి మే మధ్య కాలంలో నీరు, దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు  1,762 నమోదయ్యాయని.. అయితే ఈ ఏడాది మే వరకు ఈ వ్యాధుల సంఖ్య 54శాతం తగ్గి 809 కేసులు మాత్రమే వెలుగు చూశాయని డాటా వెల్లడించింది.

2016 మొదటి ఐదు నెలల్లో 114 డెంగ్యూ కేసులు నమోదు కాగా..  ఈ ఏడాది వీటి సంఖ్య కేవలం 37 మాత్రమే అని బీఎమ్‌సీ తెలిపింది. దోమల ద్వారా వచ్చే వ్యాధులలో ఈ ఏడాది 71 శాతం తగ్గుదల ఉందన్నది. అదేవిధంగా, 2016లో ఇదే కాలంలో ముంబైలో 1,628 మలేరియా కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది వీటి సంఖ్య 753కు పడిపోయిందని వెల్లడించింది. నగరంలో మే 20 వరకు 19 కుష్టు వ్యాధి కేసులు నమోదయ్యాయి, 2016లో మొదటి ఐదు నెలల్లో ఈ సంఖ్య 20 అని అధికారులు తెలిపారు.(ఏకంగా చైనాను దాటేసిన మహారాష్ట్ర!)

ప్రస్తుతం నిర్మాణ కార్యకలాపాలు తగ్గడం వల్ల మలేరియా, ఇతర వ్యాధులు తగ్గాయని ఆరోగ్య అధికారులు తెలిపారు. ‘లాక్‌డౌన్ సమయంలో ప్రజల కదలికలు 90 శాతం పరిమితం చేయబడ్డాయి. అంతేకాక ప్రజలు పార్కులు, ఆట స్థలాలకు వెళ్లలేదు. నిర్మాణాలపై పరిమితి కారణంగా.. నీరు నిల్వ ఉండే వస్తువులు తగ్గాయి. ఫలితంగా దోమల సంఖ్య కూడా బాగా తగ్గిందని’ అని బీఎమ్‌సీ అదనపు కమిషనర్ సురేష్ కాకాని అన్నారు. ప్రతి ఏడు వర్షా కాలంలో దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల సంఖ్య పెరుగుతుందని.. అటువంటి రోగుల చికిత్స కోసం కోవిడ్ కాని ఆసుపత్రులను సిద్ధం చేశామని అన్నారు. డెంగ్యూ, మలేరియా, కుష్టువ్యాధి ఉన్న రోగులను కేఈఎమ్‌ (కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్) ఆసుపత్రితో పాటు ఇతర స్థానిక ఆసుపత్రులకు పంపుతామని కకాని తెలిపారు.(మందు బాబులకు కిక్‌ ఇచ్చే వార్త)

కరోనావైరస్, మలేరియా, డెంగ్యూ, జ్వరం లక్షణాలు ఒకే రకంగా ఉండటం వల్ల రోగులు, వైద్యులలో భయాందోళనలు.. గందరగోళానికి కారణమవుతుందన్నారు. ‘ల్యాబ్‌ రిపోర్ట్స్‌ కంటే ముందే డెంగ్యూ, మలేరియాలో కనిపించే అసాధారణమైన ఇతర లక్షణాల వల్ల రోగ నిర్ధారణ చేయగలము. రుచి, వాసన కోల్పోవడం, వేళ్లు, పాదాలపై మచ్చలు వంటి లక్షణాల ద్వారా ఒక అంచనాకు రాగలం. అలాగే ఊఐపిరితిత్తుల గురించి తెలుసుకోవడానికి ఎక్స్-రే సహాయపడుతుంది’ అని హిందూజా ఆసుపత్రిలోని ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ లాన్సెలాట్ పింటో అన్నారు. అంతేకాక గతంలో కోవిడ్ -19, డెంగ్యూతో బాధపడుతున్న రోగులకు చికిత్స అందిచామని ఆయన తెలిపారు. కరోనా రోగికి డెంగ్యూ కూడా ఉంటే ఆరోగ్యపరిస్థితులు మరింత విషమిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.(తుంపర్లు.. యమకింకర్లు!)

మరిన్ని వార్తలు