లాక్‌డౌన్‌: ఆ 25 జిల్లాల్లో కాంటాక్ట్‌ కేసులు లేవు

13 Apr, 2020 18:30 IST|Sakshi

ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఆర్థిక రంగాన్ని సంక్షోభంలోకి నెట్టింది. అదీ ఇదీ అని కాకుండా అన్ని రంగాలు కుదేలయ్యాయి. రోజూ కూలీ చేసుకుని పొట్టపోసుకునే బడుగు జనం పాలిట శాపమైంది. అయితే, మందుల్లేని ప్రాణాంతక కోవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే అస్త్రం. ఇక దేశవ్యాప్త లాక్‌డౌన్‌ గడువు రేపటితో ముగుస్తున్న తరుణంలో లాక్‌డౌన్‌ ప్రాముఖ్యాన్ని తెలిపే ఓ విషయం వెల్లడైంది. కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన కొన్ని ప్రాంతాల్లో ప్రజల సహకారంతో లాక్‌డౌన్‌ పక్కాగా అమలు కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లోని 25 జిల్లాల్లో గత 15 రోజుల్లో ఒక్క కోవిడ్‌ కేసు కూడా నమోదు కాలేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ సోమవారం తెలిపారు. ప్రజల స్వీయ నియంత్రణ, కేసులు బయటపడిన ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించడంతో కోవిడ్‌ కాంటాక్టు కేసులు నమోదు కాలేదని అన్నారు.

15 రాష్ట్రాల్లోని 25 జిల్లాలివే..
గోందియా-మహారాష్ట్ర
రాజ్‌నంద్‌గావ్‌, దుర్గ్‌, బిలాస్‌పూర్‌-ఛత్తీస్‌గర్‌
దేవన్‌గిరి, కొడగు, తుంకూరు, ఉడిపి-కర్ణాటక
దక్షిణ గోవా-గోవా
వయనాడ్‌, కొట్టాయం-కేరళ
పశ్చిమ ఇంఫాల్‌-మణిపూర్‌
రాజౌరి-జమ్మూకశ్మీర్‌
దక్షిణ ఐజ్వాల్‌-మిజోరాం
మహె-పుదుచ్చేరి
ఎస్‌బీఎస్‌ నగర్‌-పంజాబ్‌
పట్నా, నలంద, ముంగర్‌-బిహార్‌
ప్రతాప్‌గర్‌-రాజస్తాన్‌
పానిపట్‌, రోహ్‌తక్‌, సిర్సా-హరియాణ
పౌరీ గర్హవాల్‌-ఉత్తరాఖండ్‌
భద్రాద్రి కొత్తగూడెం-తెలంగాణ

ఇక కేంద్ర ఆరోగ్యశాఖ వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 9,352 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వారిలో 979 మంది కోలుకున్నారు. 324 మంది మృతి చెందారు. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 8048.
(చదవండి: తొలి కేసు నమోదైన కేరళలో ఊరట‌..)

మరిన్ని వార్తలు