విద్యార్థులను అడ్డుకున్న స్టోర్‌ సిబ్బంది

30 Mar, 2020 11:14 IST|Sakshi

సాక్షి, బెంగ‌ళూరు : క‌రోనా వైరస్‌ను క‌ట్ట‌డి చేసేందుకు దేశంలో లాక్‌డౌన్ విధించి అత్య‌వ‌స‌ర సేవ‌లు మిన‌హా మిగ‌తా సేవ‌ల‌పై ఆంక్ష‌ల్ని విధించిన విష‌యం తెలిసిందే. దీంతో నిత్యావ‌స‌రాల స‌రుకుల కోసం సూప‌ర్ మార్కెట్ల వ‌ద్ద‌ ప్ర‌జ‌లు క్యూ క‌డుతున్నారు. ఈ క్ర‌మంలో జాతి వివ‌క్ష‌త‌ను చూపుతూ ఈశాన్య భార‌త్ నుంచి వచ్చిన విద్యార్థుల‌ను సూప‌ర్ మార్కెట్‌లోకి అనుమ‌తించ‌ని ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చోటుచేసుకుంది. కోవిడ్ 19 పేరుతో ప్ర‌జ‌ల‌ను హింసించే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అన్ని రాష్ట్రాల‌ను కోరిన‌ప్ప‌టికీ ఈ సంఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం. (ఆ రెండు రాష్ట్రాల్లో 200 దాటిన కరోనా కేసులు)

వివరాల ప్రకారం.. నాగాలాండ్‌కు చెందిన కొంత‌మంది విద్యార్థులు కర్ణాట‌క‌లో నివ‌సిస్తున్నారు. ఇటీవ‌ల వీరు మైసూర్‌లోని సూప‌ర్ మార్కెట్‌కు వెళ్ల‌గా అక్క‌డ వారిని స్టోర్‌ సిబ్బంది అడ్డుకున్నారు. షాప్‌లోకి అనుమ‌తించం అంటూ వారితో వాదించారు. దీంతో త‌మ‌పై వివ‌క్ష చూపుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఈశాన్య ప్రాంత విద్యార్థులు అక్కడి సిబ్బందిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించిన వీడియోను డాలీ కికాన్ అనే వ్య‌క్తి ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈశాన్య భారతదేశం నుంచి వలస వచ్చిన వారిని కర్ణాటక వాసులు ఆహారం కొనడానికి అనుమతించ‌డం లేదు. సిగ్గుచేటు. భారత్‌లో జాత్యహంకారం రోజువారీ వ్యవహారం’ అంటూ ట్విటర్‌ వేదకగా తన ఆవేదన వ్యక్తం చేశారు. (ఏప్రిల్‌ 14 వరకూ శ్రీవారి దర్శనం బంద్‌)

కాగా ఈ ఘ‌ట‌న త‌మ దృష్టికి వ‌చ్చిన వెంట‌నే కేసు నమోదు చేశామ‌ని పోలీసులు తెలిపారు. స్టోర్ మేనేజర్‌తోపాటు ఇతర సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు కమిషనర్ చంద్రగుప్తా తెలిపారు. లాక్‌డౌన్ కాలంలో ప్ర‌జ‌లు, దుకాణ యజమానులు, సిబ్బంది ఇలాంటి చర్యలకు దూరంగా ఉండాలని ఆయ‌న కోరారు. అలాగే ఇలాంటి సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు.

ఇక విష‌యంపై స్పందించిన‌ బెంగళూరు పోలీస్ కమిషనర్ భాస్కర్ రావు ఆదివారం ట్వీట్ చేశారు. ‘ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన మా సోదరులను కొంతమంది తప్పుదారి పట్టించి, కోవిడ్-19 పేరుతో అనుచిత‌ వ్యాఖ్యలు చేశారు. ఇలా తప్పుదారి పట్టించేవారిపై కఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం. నార్త్ ఈస్ట్ నుంచి వ‌చ్చిన సోద‌ర, సోద‌రీమ‌ణులు ఇక్కడ సురక్షితంగా ఉన్నారు. మీకు ఎక్క‌డైనా అన్యాయం జ‌రిగితే సమీప పోలీస్టేషన్‌లో సంప్రదించండి లేదా నన్ను నేరుగా క‌ల‌వండి’ అంటూ వారికి అండ‌గా నిలిచారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా