నన్ను క్షమించండి

30 Mar, 2020 05:25 IST|Sakshi

కఠిన నిర్ణయమే.. అయినా తప్పదు

లాక్‌డౌన్‌పై మోదీ

కరోనాపై విజయం సాధిస్తామని ‘మన్‌ కీ బాత్‌’లో ధీమా

న్యూఢిల్లీ: కరోనా కోరల్లో చిక్కుకొని జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కోవిడ్‌–19 మహమ్మారిపై చేస్తున్న పోరాటంలో భారత్‌ తప్పక విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ చేయడం కఠిన నిర్ణయమైనా ప్రస్తుత పరిస్థితుల్లో తప్పదన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు దేశప్రజలందరూ తనను క్షమించాలని వేడుకున్నారు. ఆకాశవాణి మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ఆదివారం జాతినుద్దేశించి ప్రధాని మాట్లాడారు. ‘ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలు చెబుతాను. ముందుగా దేశ ప్రజలందరినీ క్షమించమని కోరుకుంటున్నాను.

మీరందరూ నన్ను క్షమిస్తారనే నాకు తెలుసు. నిరుపేద సోదర సోదరీమణులు ఈయనేం ప్రధానమంత్రి .. మమ్మల్ని సమస్యల ఊబిలోకి తోసేశాడు అని అను కుంటూ ఉండే ఉంటారు. అందుకే ప్రత్యేకంగా మీ అందరూ నన్ను మన్నించాలి. బహుశా, చాలా మం ది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇలా ఇళ్లలో బంధిస్తావా అని ఆ గ్రహి స్తూ ఉంటారు. నేను మీ అందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను కానీ 130 కోట్ల మంది జనాభా ఉన్న దేశాన్ని రక్షించడానికి ఇంతకంటే మరో మార్గం లేదు. కరోనాతో యుద్ధమంటే చావుబతుకుల మధ్య పోరాటం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. గెలిచి తీరుతాం’’అని ప్రధాని అన్నారు.

వైద్యసిబ్బంది సేవలు భేష్‌  
కరోనాపై పోరాటంలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు, ప్రభుత్వ అధికారులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పట్నుంచి ప్రజలకి ఇబ్బందులు తలెత్తకుండా నిత్యావసరాలు, కూరలు, పాలు సరఫరా చేసేవారు వేలాది
మంది నిరంతరాయంగా పని చేస్తున్నారంటూ కొనియాడారు.  

దయచేసి చట్టాన్ని ఉల్లంఘించకండి
‘నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలనుకోరు.  కానీ కొందరు చేస్తున్నారు. వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్‌ డౌన్‌ నియమాలను పాటించకపోతే ఈ వైరస్‌ నుంచి కాపాడుకోవడం కష్టమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు’అని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా మోదీ కరోనా నుంచి కోలుకున్న వారితో మాట్లాడారు.  

ప్రధానికి రాహుల్‌ లేఖ  
కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా లాక్‌డౌన్‌ ప్రకటించడం తీవ్రమైన గందరగోళానికి దారి తీసిందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన ప్రధానికి ఆదివారం లేఖ రాశారు. వలస కార్మికుల దుస్థితిని ప్రధాని దృష్టికి తీసుకువెళ్లిన రాహుల్‌ అభివృద్ధి చెందిన దేశాలు పాటించిన సంపూర్ణ లాక్‌డౌన్‌ వ్యూహం భారత్‌లో సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దినసరి వేతన జీవులకి , నిరక్షరాస్యులకి ఈ పరిస్థితిని అర్థం చేసుకునే శక్తి ఉండదని రాహుల్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. దేశాన్ని పూర్తిగా లాక్‌డౌన్‌ చేయడంతో కార్మికులు ఊళ్లకి వెళుతూ ఉండడంతో గ్రామాల్లో కూడా కరోనా ప్రబలే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.   

>
మరిన్ని వార్తలు