మే 3 వరకు లాక్‌డౌన్‌ 

15 Apr, 2020 02:57 IST|Sakshi

ఆర్థికంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది, అయినా తప్పదు 

ఏప్రిల్‌ 20 తరువాత కొన్ని ప్రాంతాల్లో ఆంక్షల సడలింపు 

ఔషధ, ఆహార నిల్వలు తగినన్ని ఉన్నాయి   సప్త సూత్రాలు పాటించండి 

దేశ ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ 

ప్రపంచానికి పెను విపత్తుగా పరిణమించిన కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరో 19 రోజులు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతనెల 25న ప్రారంభమైన లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం ఉదయం 10 గంటలకు జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన.. వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోనందునే లాక్‌డౌన్‌ పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థికంగా భారీ మూల్యం చెల్లిస్తున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను కాపాడటానికి అదొక్కటే మార్గమని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో మే 3 వరకు ఎక్కడివారు అక్కడే ఉండాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు. ఏప్రిల్‌ 20 తర్వాత హాట్‌స్పాట్స్‌ కాని ప్రాంతాల్లో కొంతమేరకు నిబంధనలు సడలించే అవకాశం ఉందన్నారు. లాక్‌డౌన్‌కు సంబంధించిన సమగ్ర నియమ నిబంధనలను బుధవారం విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు ఏడు సూత్రాలను మోదీ సూచించారు.  

సాక్షి, న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్‌ను పూర్తిగా కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కాలాన్ని పొడిగించాలని కేంద్రం నిర్ణయించింది. మార్చి 25వ తేదీ నుంచి కొనసాగుతున్న దేశవ్యాప్త నిర్బంధాన్ని మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. మొదట ప్రకటించిన ప్రకారం, లాక్‌డౌన్‌ ఏప్రిల్‌ 14తో ముగియాల్సి ఉన్న విషయం తెలిసిందే. తొలి దశ లాక్‌డౌన్‌ విజయవంతమైనప్పటికీ, వైరస్‌ ముప్పు పూర్తిగా తొలగిపోలేదని, అందువల్ల లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటించారు.  

లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థికంగా భారీ మూల్యాన్నే చెల్లించాల్సి వస్తోందని, అయితే, దేశ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంతకుమించిన మార్గం లేదని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మంగళవారం ఉదయం 25 నిమిషాల పాటు ప్రసంగించారు. రెండో దశలోనూ లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తామని ప్రధాని స్పష్టం చేశారు. సంబంధిత సమగ్ర నియమ, నిబంధనలను బుధవారం ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. అయితే, వైరస్‌ వ్యాప్తిపై సమీక్ష అనంతరం, హాట్‌స్పాట్స్‌ కాని ప్రాంతాల్లో ఏప్రిల్‌ 20 తరువాత కొంతమేరకు నిబంధనలను సడలించే అవకాశముందన్నారు. ‘మే 3 వరకు నిబంధనలను కచ్చితంగా పాటించండి. ఎక్కడివారు అక్కడే ఉండండి. సురక్షితంగా ఉండండి’అని దేశప్రజలకు విజ్ఞప్తి చేశారు. చాలా అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. కరోనా సంక్షోభాన్ని భారత్‌ సమర్థంగా ఎదుర్కొందని, ఇందులో దేశ ప్రజల తోడ్పాటు, త్యాగం ఎంతో ఉందని ప్రధాని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా లాక్‌డౌన్‌ కాలంలో పాటించాలంటూ కొన్ని సూత్రాలను ప్రజలకు నిర్దేశించారు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవడం, పేదలకు చేయూతనివ్వడం తదితర సూచనలు అందులో ఉన్నాయి. ‘సరైన సమయంలో సమగ్ర కార్యాచరణను అమల్లోకి తీసుకువచ్చాం. లేదంటే, మన పరిస్థితి వేరేలా ఉండేది. మన మార్గం సరైనదేనని ఫలితాలు కూడా నిర్ధారిస్తున్నాయి. మనకున్న తక్కువ వనరులతో సమస్యను దీటుగా ఎదుర్కొన్నాం. 21 రోజుల లాక్‌డౌన్‌ సత్ఫలితాలను ఇచ్చింది’అని మోదీ పేర్కొన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని గణనీయంగా పెంచనున్నామని వెల్లడించారు. ‘ఏప్రిల్‌ 20 వరకు అన్ని పట్టణాలు, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌ నిబంధనలను ఎంతవరకు పాటిస్తున్నాయన్నది గమనిస్తాం.

వైరస్‌ వ్యాప్తిని సమర్థంగా అడ్డుకున్న ప్రాంతాల్లో, హాట్‌స్పాట్స్‌కాని ప్రాంతాల్లో స్వల్పంగా నిబంధనల సడలింపు ఉంటుంది’అని ప్రధాని వివరించారు. కరోనాపై భారత్‌ పోరు తీవ్రంగానే ఉందని, భారత్‌ వద్ద అవసరమైన ఔషధ, ఆహార నిల్వలు ఉన్నాయని తెలిపారు. ‘రానున్న వారం రోజులు ఆంక్షల అమలులో కఠినంగానే ఉండాల్సి ఉంది. కొత్తగా హాట్‌స్పాట్స్‌ ఏర్పడితే సమస్య మరింత జటిలమవుతుంది’అన్నారు.

లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రోజు కూలీల వెతలను కూడా ప్రధాని ప్రస్తావించారు. ‘రోజువారీ కూలీలు, దినసరి వేతనం లేనిదే పూటగడవని వారు కూడా నా కుటుంబసభ్యులే. నా ప్రాథమ్యాల్లో ముఖ్యమైనది వారి జీవితాల్లోని కష్టాలను తొలగించడమే. గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా ఆ దిశగా కొన్ని చర్యలు తీసుకున్నాం. కొత్తగా రూపొందించనున్న మార్గదర్శకాల్లో వారి ప్రయోజనాలనూ చూస్తాం’అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా ఆయనను ప్రధాని స్మరించుకున్నారు. 

మోదీ సప్తపది.. 
1. మీ ఇళ్లలోని వృద్ధులను, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులున్న వారిని జాగ్రత్తగా చూసుకోండి. 

2. లాక్‌డౌన్‌ లక్ష్మణ రేఖను కచ్చితంగా పాటించండి. ఇంట్లో తయారు చేసుకున్న మాస్క్‌లు ధరించండి. భౌతిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి. 

3. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆయుష్‌ మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను పాటించండి.  

4. మీ స్మార్ట్‌ ఫోన్‌లలో ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోండి. 

5. మీ చుట్టూ ఉన్న పేదల యోగక్షేమాలను పట్టించుకోండి. ముఖ్యంగా వారి ఆహార అవసరాలను తీర్చేందుకు ప్రయత్నించండి. 

6. మీ సంస్థల్లో పనిచేసే వారి సంక్షేమాన్ని పట్టించుకోండి. వారి జీవనోపాధిని తొలగించకండి.

7. కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తున్న వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బందిని గౌరవించండి. 

మరిన్ని వార్తలు