లాక్‌డౌన్‌తో 12 కోట్ల మంది నిరుద్యోగులు

2 Jun, 2020 15:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారిని అరికట్టడంలో భాగంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ తో దేశంలో 11.40 కోట్ల మంది ఉపాధి కోల్పోయారని, వారిలో 91.10 లక్షల మంది దినసరి కూలీలు కాగా, కంపెనీల లేఆఫ్‌ల వల్ల 1.70 కోట్ల మంది నెలవారి వేతన జీవులు రోడ్డున పడ్డారని ఆర్థిక నిపుణుల లెక్కలు తెలియజేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 2,71,000 ఫ్యాక్టరీలు నిలిచి పోయాయని, ఆరున్నర కోట్ల నుంచి ఏడు కోట్ల సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మూతపడ్డాయని వారు తెలియజేశారు. 

కోవిడ్‌–19ను ఎదుర్కోవడంలో భారత్‌ ఏ విధంగా కొంత విఫలమైందో, ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు మున్ముందు ఎలా ఎదుర్కోవాలో, అందుకు తీసుకోవాల్సిన చర్యలేమిటో వివరిస్తూ దేశంలోని మూడు ఉన్నత వైద్య సంఘాలు సంయుక్తంగా ఓ నివేదిక రూపొందించాయి. మే 25వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీకి ఆ నివేదికను సమర్పించాయి. ఫ్యాక్టరీల మూత కారణంగా 11.40 కోట్ల మంది భారతీయులు ఉపాధి కోల్పోయిన విషయాన్ని కూడా నిపుణులు అందులో ప్రస్తావించారు. 
(చదవండి: వలస కార్మికులకు ఓపిక లేకనే....అమిత్‌ షా)

ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ అసోసియేషన్, ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్, ది ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఎపిడమాలోజిస్ట్స్‌‌ సంయుక్తంగా సమర్పించిన ఆ నివేదికపై కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ సలహాదారులు, ఆలిండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, బనారస్‌ హిందూ యూనివర్శిటీ, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, పోస్ట్‌గ్రాడ్యువేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసర్చ్‌కు చెందిన మాజీ, ప్రస్తుత ప్రొఫెసర్లు సంతకాలు చేశారు. భారత్‌లో జనవరి 30వ తేదీనే తొలి కరోన కేసు బయట పడినప్పటికీ ఎపిడమాలోజిస్ట్‌లను సంప్రదించి, తగిన చర్యలు తీసుకోవడంలో ఆలస్యం జరిగిందని నివేదిక పేర్కొంది. 
(చదవండి: హెయిర్‌కట్‌కు ఆధార్‌ తప్పనిసరి!)

మరిన్ని వార్తలు