25 రోజులపాటు కాలినడకన..

16 Jun, 2020 17:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘సాధారణంగా మానవ శరీర నిర్మాణం రోజుకు కొన్ని గంటలు నడిచేందుకే అనువుగా ఉంటుంది. ఓ కిలోమీటరు నడిస్తే 60–70 కాలరీలు కరిగి పోతాయి. కడుపు నిండా తిన్న ఆహారం దాదాపు 600 కాలరీలు ఉంటుంది. అంటే ఎనిమిది నుంచి పది కిలోమీటర్లు నడిస్తే ఆ 600 కాలరీలు కరిగిపోతాయి. ఇది ఉష్ణోగ్రత 25 డిగ్రీల లోపు ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ.

లాక్‌డౌన్‌ కారణంగా సొంతూళ్లకు బయల్దేరిన కార్మికులు రోజుకు 8 నుంచి 12 కిలోమీటర్లు నడిచారు. అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు లేకపోవడంతో, చేతిలో డబ్బులు లేకపోవడంతో ఇంకా కొందరు నడుస్తున్నారు. మొన్నటిదాకా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలో, ఒంటిపూట భోజనం లేదా అర్ధాకలితో నడిచారు. అలాంటప్పుడు వారిలో జీవన క్రియ భయంకరంగా దెబ్బతింటుంది. మానవ కండరాల్లోని అణువులు తగినంత శక్తిని విడుదల చేయలేవు. వాటి నుంచి ‘లాక్టిక్‌’ యాసిడ్‌ వెలువడుతుంది. అది శరీరాన్ని తీవ్ర అలసటకు గురి చేస్తుంది. శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో ఎక్కువగా ఉపయోగపడే గ్లూకోజ్‌ పడి పోతుంది. అప్పుడు కళ్లు తిరుగుతాయి. దప్పిక, ఆకలి ఎక్కువవుతుంది. సకాలంలో ఆహారం, విశ్రాంతి లేకపోతే స్పృహతప్పి పోతారు. సకాలంలో వైద్యం అందకపోతే మరణిస్తారు.

ఎండలో ఎక్కువగా నడుస్తుంటే శరీరంలోని నీటి స్థాయి పడిపోతుంది. శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌లో సమతౌల్యం దెబ్బతింటుంది. సోడియం లెవల్స్‌ పడిపోయి, వాంతుల అవుతాయి. దీన్ని ‘సన్‌స్ట్రోక్‌’ లేదా ‘డీహైడ్రేషన్‌’గా వ్యవహరిస్తారు. సకాలంలో వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. సుదీర్ఘ నడక కారణంగా అరిపాదాలు బొబ్బలెక్కుతాయి. అవి ఇన్‌ఫెక్షన్లకు దారితీస్తే ప్రాణాంతకం అవుతాయి. ఈ వైద్యపరమైన విషయాలను బిలాస్‌పూర్‌లో గిరిజనులకు, గ్రామీణ ప్రజలకు అతి చౌకగా వైద్య సేవలు అందించేందుకు ‘జన్‌ స్వస్థ సయోగ్‌’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న డాక్టర్‌ యోగేశ్‌ జైన్‌ తెలిపారు.

మధ్యప్రదేశ్‌కు చెందిన అమిత్‌ కుమార్‌ గత మే నెలలో మొహమ్మద్‌ సాయిద్‌ చేతుల్లో మరణించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన  విషయం తెల్సిందే. ఆయన ‘సన్‌స్ట్రోక్‌’తోనే మరణించారు. ఇలాంటి కారణాల వల్లనే గత మే 31వ తేదీ వరకు కాలి నడకన బయల్దేరిన వలస కార్మికుల్లో 46 మంది మరణించినట్లు వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ జిల్లా క్వారంటైన్‌ కేంద్రంలో ఉన్న 17 ఏళ్ల బలిరామ్‌ కుమార్‌ బెంగళూరు నుంచి 25 రోజులపాటు నడిచి అక్కడికి చేరుకున్నారు. కాళ్లకు బూట్లు ఉన్నప్పటికీ పాదాలు బొబ్బలెక్కాయని, పాదాలతోపాటు మొత్తం వొళ్లంతా నొప్పులు సలిపేస్తున్నాయని ఆయన మీడియాకు తెలిపారు. (తిండి, నీళ్లు లేవు.. చుట్టూ శవాలే!)

బిహార్‌లోని కతియార్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్న 20 ఏళ్ల వినోద్‌ యాదవ్‌ తాను 27 రోజులపాటు నడిచి బెంగళూరు నుంచి అక్కడికి చేరుకున్నట్లు చెప్పారు. ఇలా ఎంతో మంది ప్రాణాలకు తెగించి తమ స్వస్థలాలకు చేరుకున్న విషయం తెల్సిందే. దేశంలో కరవు కాటకాలు, కలరా లాంటి మమమ్మారీలు దాపురించినప్పుడే కాకుండా దేశ విభజన సందర్భంగా మత ఘర్షణలు చెలరేగినప్పుడు ఇలాగే మానవ వలసలు కొనసాగాయి. అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం సందర్భంగా 1942లో బర్మాలోని రంగూన్‌ నగరంపై జపాన్‌ బాంబులు వేసినప్పుడు కూడా వేలాది మంది భారతీయులు భారత్‌కు కాలి నడకన బయల్దేరారు. బర్మాను మయన్మార్‌ అని, రంగూన్‌ను యాంగన్‌ అని నేడు వ్యవహరిస్తారని తెల్సిందే. (ఇలాంటి కథలు...ఇంకెన్నో!)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు