లాక్‌డౌన్‌: అడ్డుకున్న పోలీసుపై కారుతో అటాక్‌!

2 May, 2020 13:06 IST|Sakshi

చండీగఢ్‌‌: లాక్‌డౌన్ పటిష్ట అమలుకు పోలీసులు రేయింబవళ్లు కష్టపడుతుంటే కొందరు వారిపట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసు చేయి నరికేసిన ఉదంతం మరువకముందే పంజాబ్‌లో అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అడ్డుకున్న పోలీసుపై ఓ వ్యక్తి కారుతో దాడికి యత్నించాడు. ఈ ఘటన జలంధర్‌లోని మిల్క్‌ చౌక్‌ చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలు.. ఏఎస్‌ఐ ముల్క్‌రాజ్‌ మరికొందరు పోలీసులు మిల్క్‌ చౌక్ వద్ద విధుల్లో ఉన్నారు.‌ 

అటువైపుగా వచ్చిన ఓ కారును ముల్క్‌రాజ్ అడ్డుకుని,‌ కర్ఫ్యూ పాస్‌ చూపించాలని కోరాడు. దాంతో ఆ వ్యక్తి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. అప్పటికే వాహనానికి అడ్డుగా ఉన్న ముల్క్‌రాజ్‌ ప్రమాదాన్ని గ్రహించి కారు బానెట్‌పైకి దుమికి పట్టుకున్నాడు. ఏఎస్‌ఐ కారుపై ఉండగానే.. ఆ వ్యక్తి దాదాపు 200 మీటర్ల దూరం వాహనాన్ని పోనిచ్చాడు. అక్కడే ఉన్న ఇతర పోలీసులు పరుగెత్తుకెళ్లి కారును అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ‌ సుర్జీత్‌ సింగ్‌ తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న ఏఎస్‌ఐ చేయిను నరికిన ఘటన పటియాలాలో ఏప్రిల్‌ 12 జరిగిన సంగతి తెలిసిందే.
(చదవండి: వలస కూలీల్లో కరోనా కలకలం)

మరిన్ని వార్తలు