మిడతల దాడి: పాక్‌ నిర్లక్ష్యపు కుట్ర

30 May, 2020 09:41 IST|Sakshi

సాక్షి, నూఢిల్లీ : మహారాష్ట్రలోని అమరావతి, వార్దా, నాగపూర్‌ ప్రాంతాలపై మే 26వ తేదీన ఆకాశాన్ని కమ్మేసినట్టు, భూమిని కప్పేసినట్టు కోట్లాది మిడతలు దాడి చేయడం తెల్సిందే. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఏప్రిల్‌ నెలలోనే ఈ మిడతల దాడులు కొనసాగాయి. జైపూర్‌ను ముట్టడించిన మిడతల దాడిని ఎంతోమంది స్థానికులు వీడియోలు, ఫోటోలు తీసి సోషల్‌ మీడియాలో కుమ్మేశారు. గత 26 ఏళ్లలో ఎన్నడు లేనంత తీవ్రంగా ఈసారి మిడతలు భారత్‌పైకి దండయాత్రకు వచ్చాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. (మధ్యప్రదేశ్ వైపు మిడతల దండు! )

భారత్‌లోని 739 జిల్లాలకుగాను 41 జిల్లాలపై ఈసారి మిడతలు దాడి చేశాయని వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న ‘లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌’ డిప్యూటీ డైరెక్టర్‌ కేఎల్‌ గుర్జార్‌ తెలిపారు. అసలు ఎందుకు మిడతలు దాడులు చేస్తాయి ? ఏ సీజన్‌లో దాడులు చేస్తాయి ? వాతావరణ పరిస్థితులకు, వాటి దాడులకు సంబంధం ఏమన్నా ఉందా ? వాటి వల్ల పంటలకు ఏ మేరకు నష్టం వాటిల్లుతుంది ? వాటి దాడులను ఎలా ఎదుర్కోవాలి ? అందుకోసం భారత్‌లోని ఏ విభాగం పోరాడాలి? ఎలా పోరాడాలి? అందుకు ఎవరి సహకారం అవసరం ? అన్న పలు ఆసక్తికరమైన ప్రశ్నలన్నింటికి సమాధానాలు అందుబాటులోనే ఉన్నాయి. (వణికిస్తున్న రాకాసి మిడతలు)

మిడతలది 90 రోజుల సైకిల్‌
ఆడ, మగ మిడతలు కలసుకోవడం, ఆడ మిడతలు గుడ్లు పెట్టడం, ఆ గుడ్లు పిల్లలవడం, పిల్లలు ఎదిగి ఎగిరి పోవడం ఒక సర్కిల్‌. ఈ సర్కిల్‌ ఏడాదికి 90 రోజులపాటు కొనసాగుతుంది. 90 రోజులపాటు అవి దేశ దేశాలపై దాడులు చేస్తూ పచ్చని పంట పొలాలను ఆశిస్తాయి. ఓ మిడత మంద ఓ ప్రాంతం పంటలపై ‘మేటింగ్, బ్రీడింగ్‌’ల కోసం ఆగిపోతే, చోటు సరిపోదని భావించిన ఇతర మందలు పచ్చదనం వెతుక్కుంటూ మరో ప్రాంతం వైపు దూసుకు పోతాయి. ఆడ, మగ మిడతలు కలుసుకున్న రెండు రోజులకే ఆడ మిడతలు 60 నుంచి 80 గుడ్లు పెడతాయి. అవి ఐదు నుంచి పది సెంటీ మీటర్ల పొడవు ఉంటాయి. గుడ్లు పెట్టడానికి మిడతలకు బలమైన నేల కూడా కావాలి. పది నుంచి 15 రోజుల్లోగా ఆ గుడ్ల నుంచి పిల్లలు బయటకు వచ్చి ఎగిరేందుకు సిద్ధం కూడా అవుతాయి. ఈ 90 రోజుల సర్కిల్‌లో మిడతలు తెగతింటాయి. అందువల్ల పంట పొలాలన్నీ సర్వనాశనం అవుతాయి. పచ్చని పొలాలు అందుబాటులో లేనప్పుడు మిడతలు పెద్ద చెట్లపై వాలి వాటి ఆకులను కూడా తింటాయి. అవి మనుషులు, జంతువుల జోలికి మాత్రం రావు. (పొలాల మధ్యన డీజే, లౌడ్‌ స్పీకర్ల హోరు..)

జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌ సీజన్‌
మనకు మిడతల సైకిల్‌ కొనసాగే ప్రాంతాలు ఇరాన్, పాకిస్థాన్, భారత్, అఫ్ఘానిస్థాన్‌ దేశాలు. భారత భూభాగంలో మిడతల సీజన్‌ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు. ఇరాన్, పాకిస్థాన్‌ మీదుగా భారత్‌కు వచ్చి, అఫ్ఘాన్‌వైపు తరలిపోయే మిడతలు ఈసారి భారత్‌లోకి ఏప్రిల్, మే నెలల్లోనే వచ్చాయి. అందుకు వాతావరణ పరిస్థితుల్లో వచ్చిన మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళా ఖాతంలో చెలరేగిన తుపానులు, పశ్చిమ గాలుల ప్రభావంతో  ఈ సారి మిడతలు ముందుగానే భారత్‌లోకి దండయాత్రకు వచ్చాయి. వాటిని నాశనం చేసేందుకు క్రిమిసంహారక మందులను స్ప్రే చేస్తారు. (ఒళ్లు గ‌గుర్పొడిచే దృశ్యాలు: ల‌క్ష‌లాది మిడ‌తలు..)

ఇప్పటికే రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్‌లోని 303 ప్రాంతాల్లో (47 వేల హెక్టార్లలో) ‘లోకస్ట్‌ వార్నింగ్‌ ఆర్గనైజేషన్‌’ మందులను స్ప్రే చేసింది. ఇంకా చాలా ప్రాంతాల్లో చేయాల్సి ఉంది.  అందుకోసం 60 కొత్త స్ప్రేయింగ్‌ యంత్రాల కోసం బ్రిటన్‌కు ఆర్డర్‌ ఇచ్చామని, మరో 15 రోజుల్లో అవి వస్తాయని గుర్జార్‌ తెలిపారు. ఈసారి సమస్య తీవ్రంగా ఉన్నందున హెలికాప్టర్ల ద్వారా కూడా మందులను స్ప్రే చేయాల్సి వస్తుందని ఆయన చెప్పారు. 

భారత్, పాక్, ఇరాన్, అఫ్ఘాన్‌  మధ్య సహకారం అవసరం
మిడతలను పటిష్టంగా ఎదుర్కోవాలంటే ఈ నాలుగు దేశాల మధ్య సమన్వయం, సహకారం చాలా అవసరం. అందుకోసం ఐక్యరాజ్య సమితిలో ఈ దేశాల సభ్యులతో కూడిన కమిటీ ఒకటి ఉంది. ఇరాన్, పాక్‌ భూభాగాల మీదుగా వచ్చే మిడతలను ఆ రెండు దేశాల్లో అరికట్టినట్లయితే భారత్, అఫ్ఘాన్‌లపై అంత భారం పడదు. భారత్‌ పటిష్టంగా పనిచేస్తే అఫ్ఘాన్‌పై అంత భారం ఉండదు. ఈసారి పాకిస్థాన్‌ సహకారం సరిగ్గా లేక పోవడం వల్లనే నేడు భారత్‌పై పెద్ద సంఖ్యలో మిడతలు దాడికి వచ్చాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించిన రాజ్యాంగంలోకి 370వ అధికరణను రద్దు చేసినప్పటి నుంచి మన దేశంపై పాకిస్థాన్‌ గుర్రుగా ఉందని, అందుకని ఈసారి సరైన సహకారం లభించడం లేదని గుర్జార్‌ మీడియా ముందు అంగీకరించారు. అయినా సరైన సహకారం కోసం ఐక్యరాజ్య సమితితో కలసి తాము కషి చేస్తున్నామని ఆయన తెలిపారు. (రాకాసి మిడతల దండుపై కెమికల్‌ స్ప్రే)

మరిన్ని వార్తలు