అవిశ్వాసం; శాంతి తర్వాత అశాంతి

23 Mar, 2018 11:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ఎన్డీఏ సర్కారుపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం చర్చకు రావాల్సిఉండగా సభ వాయిదాపడింది. శుక్రవారం ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే షహీద్‌ దివస్‌కు సంబంధించి స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ కీలక ప్రకటన చేశారు. స్వాతంత్ర్యసమరయోధులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను జాతి గుర్తుచేసుకుంటున్నదని, వారి త్యాగాలు మరువలేనివని స్పీకర్‌ గుర్తుచేశారు. ఈ సందర్భంగా అమరులకు నివాళులు అర్పించిన పార్లమెంట్‌.. నిమిషంపాటు మౌనం పాటించింది.

శాంతి తర్వాత అశాంతి: అమరులను తలుచుకుంటూ మౌనం పాటించడం పూర్తైన వెంటనే సభలో ఎప్పటిలాగే నినాదాలు మిన్నంటాయి. మౌనం ముగిసిందనడానికి సూచనగా స్పీకర్‌ ‘ఓం శాంతి..’ అని అన్నారు. అప్పటికే వెల్‌లో ఉన్న టీఆర్‌ఎస్‌, ఏఐడీఏంకే సభ్యులు మౌనం ముగియగానే నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌.. ‘శాంతి తర్వాత అశాంతి..’ అని చమత్కరించారు. శాంతించాలని ఎంత చెప్పినా సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదావేశారు.

రాజ్యసభలో: షహీద్‌ దివస్‌ సందర్భంగా అటు రాజ్యసభలో అమరులకు నివాళులు అర్పించారు. అనంతరం చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. కొద్దినిమిషాలు మాత్రమే సజావుగా సాగిన సభ.. విపక్షాల ఆందోళనలతో మళ్లీ గందరగోళంగా మారింది. దీంతో చైర్మన్‌ సభను సోమవారానికి వాయిదావేశారు.

మరిన్ని వార్తలు