లంచమిచ్చినా జైలుకే

25 Jul, 2018 01:45 IST|Sakshi

పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం

న్యూఢిల్లీ: అవినీతి వ్యతిరేకం చట్ట సవరణ బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. దీని ప్రకారం లంచం తీసుకున్న అధికారులే కాదు, ఇచ్చిన వారు కూడా శిక్షార్హులవుతారు. అవినీతి నిరోధక చట్టం–1988 సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘లంచం తీసుకోవటంతోపాటు ఇవ్వడమూ నేరమే. లంచం ఇచ్చే వారికి ఇకపై మూడేళ్ల నుంచి గరిష్టంగా ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అధికారికి లంచం లేదా ఇతరత్రా లబ్ధి చేకూరుస్తామంటూ హామీ ఇచ్చే ప్రైవేట్‌ సంస్థలకు జరిమానా విధిం చే వీలుంటుంది. అవినీతి కేసులు దాఖలైన రెండేళ్లలోగా కోర్టులు విచారణ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ కేసుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులపై ఉన్నతాధికారుల అనుమతి లేకుండా పోలీసులు విచారణ చేపట్టరాదు’ అని తెలిపారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ ఎంపీ మునియప్ప మాట్లాడుతూ.. అవినీతిని అరికట్టాలంటే ఎన్నికల సంస్కరణలే మార్గమన్నారు.

మరిన్ని వార్తలు