చిట్‌ఫండ్‌’కు లోక్‌సభ ఆమోదం

21 Nov, 2019 03:55 IST|Sakshi

చిట్స్‌ మొత్తం మూడు రెట్లు పెంపు

నిర్వాహకుల కమీషన్‌ 5 – 7%

న్యూఢిల్లీ: చట్టబద్ధ చిట్‌ఫండ్స్‌ కంపెనీలకు సంబంధించిన కీలక సవరణ బిల్లుకు బుధవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. చిట్స్‌ నిర్వహిస్తున్న వ్యక్తి తీసుకునే కమీషన్‌ను ప్రస్తుతం ఉన్న 5% నుంచి 7 శాతానికి పెంచుతూ ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. అలాగే, చిట్‌ మొత్తాన్ని మూడు రెట్లు పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. ‘ది చిట్‌ఫండ్స్‌ (అమెండ్‌మెంట్‌)బిల్, 2019’పై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్‌ మాట్లాడుతూ.. చిట్‌ఫండ్స్‌ను అనధికార, అనియంత్రిత డిపాజిట్‌ పథకాలు, లేదా పోంజీ స్కీమ్స్‌తో పోల్చకూడదని పేర్కొన్నారు.

ఒకరు లేదా నలుగురి లోపు వ్యక్తులు నిర్వహించే చిట్స్‌ గరిష్ట మొత్తాన్ని రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షలకు పెంచేలా.. నలుగురు లేదా ఆపై సంఖ్యలో నిర్వాహకులున్న చిట్‌ఫండ్‌ సంస్థల్లో చిట్స్‌ మొత్తాన్ని రూ. 6 లక్షల నుంచి రూ. 18 లక్షలకు పెంచేలా ఈ బిల్లులో ప్రతిపాదనలున్నాయి. చిట్‌ఫండ్‌ నిర్వాహకుడి కమిషన్‌ను 5% నుంచి పెంచి 7% చేశారు. ‘చిట్‌ అమౌంట్‌’ను ఇకపై ‘గ్రాస్‌ చిట్‌ అమౌంట్‌’ అని, డివిడెండ్‌ను ‘షేర్‌ ఆఫ్‌ డిస్కౌంట్‌’ అని, ‘ప్రైజ్‌ అమౌంట్‌’ను ‘నెట్‌ చిట్‌ఫండ్‌’ అని పేర్కొనాలని బిల్లులో స్పష్టం చేశారు. కనీస మొత్తం (బేస్‌ అమౌంట్‌) రూ. 100 అని పేర్కొన్న నిబంధనను తొలగిస్తూ ఆ కనీస మొత్తాన్ని నిర్ధారించే అవకాశాన్ని రాష్ట్రాలకు కల్పించారు. అవసరమనుకుంటే, చిట్‌ఫండ్‌ వినియోగదారులు చిట్‌ మొత్తానికి బీమా చేయించుకోవచ్చు కానీ వినియోగదారులపై భారం మరింత పెరుగుతుందనే ఆలోచనతో.. బీమాను కచ్చితం చేయాలనుకోవడం లేదని బిల్లుపై చర్చ సందర్భంగా అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు