‘మీడియా చెప్పిందల్లా నిజం కాదు’

7 Dec, 2018 19:56 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో మహిళల భద్రత గురించి మీడియా క్రియేట్‌ చేసిన ఒపినియన్‌ వల్లే మన దేశం మహిళలకు సురక్షితం కాదనే అభిప్రాయం ఏర్పడిందంటూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అభిప్రాయ పడ్డారు. శుక్రవారం జరిగిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌(ఐఐఎమ్‌సీ) 51వ స్నాతకోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్‌ మాట్లాడుతూ.. న్యూస్‌ పేపర్లు, టీవీ చానెళ్లు పార్లమెంట్‌లో జరిగే నిరసనలు కవర్‌ చేయడానికి ఉత్సాహం చూపిస్తాయి.. కానీ సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి నడిచే డిబేట్లను ప్రసారం చేయవంటూ విమర్శించారు. ఇక్కడ మహిళలు రోడ్ల మీద తిరగరు.. అంత మాత్రం చేత భారత్‌లో ఉన్న మహిళలు సురక్షితంగా లేరని చెప్పలేం కదా అన్నారు.

అంతేకాక నేను విదేశాలకు వెళ్లినప్పుడు ఇండియాలో  ఏం జరుగుతుంది మేడం.. మీ దేశం ఇప్పటికి కూడా సురక్షితం కాదా అంటూ అక్కడి జనాలు నన్ను ప్రశ్నిస్తుంటారు అని తెలిపారు. అప్పుడు నేను గత 75 ఏళ్లుగా నేను ఇండియాలో ఉంటున్నాను.. నాకేం కాలేదు.. నా కూతురికి గాని.. కోడలికి గాని ఏం కాలేదు. మీరనుకుంటున్నట్లు ఏం లేదు. కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. అవి మా దేశంలోను.. మీ దేశంలోను.. ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటాయి. ప్రజలు నేరాలు చేస్తుంటారు. అంటే ఆ దేశంలో నేరాలు మాత్రమే జరుగుతాయా.. వేరే ఏం జరగవా అని వారిని అడుగుతాను అని తెలిపారు.

అలానే రాజకీయాల్లో ఎప్పుడు అసభ్య పదజాలమే వాడము కదా.. కొన్ని మంచి విషయాల గురించి కూడా మాట్లాడతాము. కానీ వాటి గురించి మీడియా పట్టించుకోదంటూ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సమాజానికి ఏం అవసరముంది.. కానీ మనం ఎలాంటి వార్తలు ప్రచురిస్తున్నాం అనే విషయం గురించి మీడియా సంస్థలు ఆలోచిస్తే మంచిదని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్ట్‌కు పరిస్థితిని విశ్లేషించే సామర్ధ్యం కలిగి ఉండటం చాలా ప్రధానం అని తెలిపారు. 

మరిన్ని వార్తలు