‘లోక్‌పాల్‌’ పదవికి జస్టిస్‌ దిలీప్‌ రాజీనామా

10 Jan, 2020 09:12 IST|Sakshi
జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలే

న్యూఢిల్లీ: లోక్‌పాల్‌ సభ్యత్వ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలే వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ట్వీట్‌ చేశారు. ఈ నెల 12 నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని చెప్పారు. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్‌ దిలీప్‌ 2019 మార్చి 27న లోక్‌పాల్‌ జ్యుడీషియల్‌ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌పాల్‌ చైర్మన్‌ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. లోక్‌పాల్‌ సభ్యులుగా ఎంపికైన వారి పదవీకాలం ఐదేళ్ల పాటు లేదా 70 ఏళ్ల వయసు వరకు కొనసాగనుంది.

ప్రజా సేవకుల అవినీతి కేసులను విచారించేందుకు లోక్‌పాల్‌ వ్యవస్థను ఏర్పాటు  చేశారు. 2019, మార్చిలో లోక్‌పాల్‌ మొదటి చైర్మన్‌గా జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ ప్రమాణం చేశారు. జస్టిస్‌ దిలీప్‌ బి.బొసాలేతో పాటు జస్టిస్‌ పీకే మహంతి, జస్టిస్‌ అభిలాష్‌ కుమారి, జస్టిస్‌ ఏకే త్రిపాఠి సభ్యులుగా నియమితులయ్యారు. తాజాగా జస్టిస్‌ దిలీప్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

మరిన్ని వార్తలు