లాక్‌డౌన్‌ కష్టాలు : ఆహారం కోసం ఉదయం నుంచే..

13 Apr, 2020 16:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి కట్టడికి లాక్‌డౌన్‌ అమలవుతున్న క్రమంలో పేదలకు ఢిల్లీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ఆహారం అందుకునేందుకు పేదలు, అన్నార్తులు పడరాని పాట్లు పడుతున్నారు. వాయువ్య ఢిల్లీలోని బద్లీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఉచిత భోజనం కోసం 500 మంది ఉదయం ఆరు గంటలకే క్యూలో వేచిచూశారు. మధ్యాహ్నానికి ఆ సంఖ్య 1200కు ఎగబాకింది. ఉచిత భోజనంలో పప్పు, అన్నం, కూర అందిస్తున్నారు. లంచ్‌ కోసం త్వరగా క్యూలో నిలుచునేందుకు తాము కొన్నిసార్లు ఉదయం ఆరు గంటలకే వస్తామని ఓ ఆటో రిక్షా డ్రైవర్‌ చెప్పుకొచ్చారు. లాక్‌డౌన్‌ అమలుతో జీవనోపాధి కోల్పోయిన అలాంటి వారందరికీ ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత భోజనం కడుపు నింపుతోంది.

పేదలకు ఉచిత లంచ్‌, డిన్నర్‌ సరఫరా కోసం ఢిల్లీ అంతటా 2500కు పైగా కేంద్రాల్లో ఉచిత భోజన ఏర్పాట్లు చేశారు. ఏప్రిల్‌ 1 నుంచి రోజుకు పది లక్షల మందికి సరిపడా భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఢిల్లీ ప్రభుత్వం చెబుతుండగా, క్షేత్రస్ధాయిలో పరిస్థితి గమనిస్తే చాలామంది ఉచిత భోజనం లభించక వెనుతిరిగిన ఉదంతాలు చోటుచేసుకుంటున్నాయి. తాను కొన్నిసార్లు గంటల తరబడి వేచిచూసినా తన వంతు వచ్చేసరికి భోజనం అయిపోతోందని క్యూలో నిల్చున్న ఓ వ్యక్తి తనకు ఎదురైన అనుభవం వివరించారు. లంచ్‌కు కొద్దిగంట ముందే తాను ఖాళీ టిఫిన్‌ బాక్స్‌ను క్యూలో ఉంచుతున్నానని, అప్పటికీ తన వరకూ వచ్చేసరికి ఆహారం ఉంటుందా అనేది అనుమానమేనని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఉచిత భోజన పంపిణీ కేంద్రాల వద్ద రద్దీ లేకుండా ప్రజలు సామాజిక దూరం పాటించేలా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా ఢిల్లీలో ఇప్పటివరకూ 1154 కరోనా వైరస్‌ కేసులు నమోదుకాగా, ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది.

చదవండి : ఢిల్లీలో మళ్లీ భూకంపం

మరిన్ని వార్తలు