బొగ్గు క్షేత్రాల వేలంలో లొసుగులు

27 Jul, 2016 02:09 IST|Sakshi
బొగ్గు క్షేత్రాల వేలంలో లొసుగులు

- పార్లమెంట్‌కు కాగ్ నివేదిక
- గతేడాది వేలం వేసిన ఎన్డీఏ సర్కారు
 
 న్యూఢిల్లీ : గత ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించిన బొగ్గు క్షేత్రాల ఈ-వేలంలో లోపాలను కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. కార్పొరేట్ గ్రూపుల జాయింట్ వెంచర్లు, సబ్సిడియరీలుగా బిడ్లు వేయడంతో 11 క్షేత్రాలకు సంబంధించి జరిగిన వేలంలో పోటీతత్వానికి అడ్డుకట్ట పడినట్లయిందని మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన నివేదికలో పేర్కొంది. తొలి రెండు భాగాలకు సంబంధించి జరిగిన వేలంలో సామర్థ్య పోటీ అనేది ఆడిట్ లో కనిపించలేదని తెలిపింది. మొదటి రెండు భాగాల్లో 29 బొగ్గు క్షేత్రాల్లోని 11 క్షేత్రాలకు విజయవంతంగా ఈ-ఆక్షన్ పూర్తయిందని, ఈ వేలంలో పాల్గొన్న అర్హత గల బిడ్డర్లలో ఒకే కంపెనీకి చెందినవో లేదా సబ్సిడియరీ సంస్థగానో లేదా జాయింట్ వెంచర్లగానో పాల్గొన్నాయని తెలిపింది.

ఈ పరిస్థితులను బట్టి చూస్తే జాయింట్ వెంచర్లను స్టాండర్డ్ టెండర్ డాక్యుమెంట్ అనుమతించి.. అదే సమయంలో అర్హత గల బిడ్డర్లను పరిమితం చేసిందని పేర్కొంది. దీంతో రెండు భాగాల్లో సరైన పోటీ జరిగిందనే నమ్మకం ఆడిట్‌లో కలగలేదని కాగ్ చెప్పింది. ఇక మూడో భాగంలో ఎక్కువ మంది జాయింట్ వెంచర్లుగా పాల్గొనే ఉద్దేశంతో నిబంధనలను బొగ్గు శాఖ సవరించిందని తెలిపింది. కాగ్ రిపోర్ట్‌పై ఓ అధికారి స్పందిస్తూ.. అర్హత సాధించిన బిడ్డర్లలో 6 శాతం మాత్రమే జాయింట్ వెంచర్లు అని, వాటిలో ఒక్కటే విజయవంతమైన బిడ్డర్ అని చెప్పారు. కనుక ఆ నిబంధన పోటీని నిరోధించలేదనేది అర్థమవుతుందన్నారు.

 కాగ్ గుర్తించిన ఇతర అంశాలు...
 8 రైలు ప్రమాదాలను ఫుట్‌ఓవర్ బ్రిడ్జి, ఫెన్సింగ్‌లాంటి ఏర్పాట్లతో నివారించాలని సూచించింది. 8 రైల్వేస్టేషన్లలో ప్రయాణికులకు వసతులు సరిగాలేవని, అలాగే అపరిశుభ్రత తాండవిస్తోందని ఆక్షేపించింది. 8 రూ.18,845 కోట్ల వ్యయంతో అమెరికా నుంచి తెప్పించిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ అనే ఆధునిక రవాణా విమానాలను సరిగా వినియోగించకపోవడాన్ని కాగ్ ఎండగట్టింది. 8 మిగ్-29కే యుద్ధ విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నాయని కాగ్ పేర్కొంది.

మరిన్ని వార్తలు