ఆంజనేయస్వామి పన్ను ఎగవేతదారుడా..?

24 Apr, 2016 13:28 IST|Sakshi

పాట్నా: ఆంజనేయస్వామి పన్ను ఎగవేతదారుడా..? రూ.4.33 లక్షల ఆస్తిపన్ను కట్టాలని దేవుడికి నోటీసు ఇవ్వబోతున్నారా? ఇదెక్కడి విచిత్రమండీ... కొన్ని రోజుల క్రితం చూసిన 'గోపాల గోపాల' సినిమా ఇప్పుడు గుర్తుకువస్తోంది. మనిషికి జరిగే ప్రతి నష్టానికి పూర్తి బాధ్యత దేవుడిదేనని, తనకి జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని ఆ సినిమాలో హీరో కోర్డుల వరకూ వెళ్లతాడు. కోర్టు కూడా ఆ కేసుని విచారణకు స్వీకరిస్తుంది. బిహార్ లోని అరా నగర మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చేస్తున్నది చూస్తుంటే అలానే అనిపిస్తుంది. రూ. 4.33 లక్షల ఆస్తి పన్ను ఎగవేసినందుకు లార్డ్ హనుమంతుడికి నోటీసులు జారీచేయబోతున్నారట.

అరా మున్సిపల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం... బడీ మథాయ్ పట్టణంలో లార్డ్ హనుమాన్ పేరు మీద మూడు ఆస్తులు ఉన్నాయి. చెల్లించాల్సిన ఆస్తి పన్నులను వెంటనే క్లియర్ చేయాలని ఇప్పటికే రెండు సార్లు ఆలయ బోర్డును మున్సిపల్ అధికారులు కోరారు. కానీ ఆ పన్ను కట్టకపోగా.. అధికారుల మాటను అసలు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీచేయాలనుకున్నారు. అయితే ఆ మూడు ఆస్తులు ఆంజనేయస్వామి పేరు మీదన్నట్టు తెలిసింది. దీంతో ఆయనకే నోటీసులు జారీ చేయడానికి సిద్ధమయ్యారు.

కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో రొహ్తాస్ జిల్లా కిందిస్థాయి కోర్టు లార్డ్ హనుమాన్ కు సమన్లు జారీచేసింది. స్టేట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ ఫిర్యాదు మేరకు రోడ్డు పక్కనే లార్డ్ హనుమాన్ కు టెంపుల్ ఉండటంతో ఈ సమన్లు ఆయన పేరు మీదే కోర్టు సమన్లు పంపింది. అంతకముందు, లోహియా నగర ప్రాంతంలో కూడా ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. రోడ్డు పక్కన ఆలయం నిర్మించినందుకు భజరంగ్ భళికి వ్యతిరేకంగా బెగుసారై జిల్లా అధికారులు నోటీసులు జారీచేశారు.    

>
మరిన్ని వార్తలు