శరణం అయ్యప్ప!

17 Nov, 2019 03:30 IST|Sakshi

శబరిమలలో ప్రతిధ్వనించిన శరణు ఘోష

మళ్లీ తెరుచుకున్న అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు

భారీ బందోబస్తు ఏర్పాటు

మహిళలు కోర్టు అనుమతి తెచ్చుకోవాలంటూ కేరళ సర్కార్‌ మెలిక

పది మంది ఏపీ యువతులను వెనక్కి పంపిన పోలీసులు

శబరిమల/తిరువనంతపురం: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య శబరిమలలో అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మళ్లీ తెరుచుకున్నాయి. గత ఏడాది సుప్రీంకోర్టు ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఇచ్చిన తీర్పుతో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న దృష్ట్యా ఈసారి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో దేవాలయ తంత్రి(ప్రధాన పూజారి) కందరారు మహేశ్‌ మోహనరు, మెల్షంటి(ముఖ్య పూజారి) సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి పడి పూజ చేశారు. అనంతరం భక్తులను లోపలికి అనుమతించారు.

కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి అప్పటికే వేలాదిగా తరలివచ్చిన భక్తుల అయ్యప్ప శరణు ఘోషతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి వచ్చిన 10–50 ఏళ్ల మధ్య వయస్సున్న 10 మంది యువతులను తిప్పి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ వ్యవహారాలను పర్యవేక్షించే దేవస్థానం బోర్డు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. పశ్చిమ కనుమల్లోని పెరియార్‌ పులుల అభయారణ్యం ప్రాంతంలో ఉన్న ఈ ఆలయాన్ని ప్రతి మలయాళ నెలలోని మొదటి ఐదు రోజులతోపాటు మండలపూజ మకరవిళక్కు, విషు పండగల సమయాల్లో మాత్రమే భక్తుల సందర్శన కోసం తెరుస్తారు. మండల–మకరవిళక్కు సందర్భంగా రెండు నెలలపాటు ఆలయం తెరిచి ఉండనుంది.

నిషేధాజ్ఞలు లేవు: కలెక్టర్‌
రుతుక్రమం వయస్సు మహిళలను కూడా ఆలయంలోకి పూజలకు అనుమతించవచ్చంటూ గత ఏడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం కేరళతోపాటు దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ఆలయ పరిసరాల్లో నిషేధాజ్ఞలు, వేలాదిగా పోలీసులను మోహరించినప్పటికీ అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే, ఈసారి ఎలాంటి నిషేధాజ్ఞలు లేవని పత్తనంతిట్ట కలెక్టర్‌ ప్రకటించారు. శబరిమలకు వెళ్లే దారిలో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో దాదాపు 10 వేల మంది పోలీసులను మోహరించారు. భక్తుల కోసం దేవస్వోమ్‌ బోర్డు పలు సౌకర్యాలు కల్పించింది. నీలాకల్, పంబ, సన్నిధానం ప్రాంతాల్లో భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. సన్నిధానం వద్ద 6,500 మంది భక్తులు విశ్రాంతి తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.


ఏపీ మహిళల బృందం వెనక్కి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చిన 30 మంది మహిళల బృందాన్ని పోలీసులు పంబలో అడ్డుకున్నారు. వారి గుర్తింపు పత్రాలు పరిశీలించిన మీదట అందులోని నిషేధిత 10–50 మధ్య వయస్సున్న 10 మందిని తిప్పిపంపి వేశామని పోలీసులు తెలిపారు. పంబ నుంచి శబరిమల ఆలయం 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాగా, కేరళ ప్రభుత్వ వైఖరిని పునరుజ్జీవన రక్షణ కమిటీ ఖండించింది. ప్రభుత్వ విధానం కారణంగా ఆలయంలోకి మహిళలను అనుమతించాలన్న వైఖరి క్రమంగా పలుచన కానుందని ఆ కమిటీ జనరల్‌ సెక్రటరీ పున్నల శ్రీకుమార్‌ తెలిపారు.

శబరిమల రావాలనుకునే మహిళలు తమతో పాటు కోర్టు ఆర్డర్‌ను తెచ్చుకోవాల్సి ఉంటుందన్న కేరళ దేవాదాయ శాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్‌ ప్రకటనపై ఆయన స్పందిస్తూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటన ఎలా చేస్తారు? ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకోవాలి’అని పేర్కొన్నారు. కేరళ ప్రభుత్వ వైఖరిపై హక్కుల కార్యకర్త తృప్తి దేశాయ్‌ స్పందించారు. ఆ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించడంలేదని వ్యాఖ్యానించారు. కేరళ సర్కారు తనకు భద్రత కల్పించినా కల్పించకున్నా ఈ నెల 20వ తేదీ తర్వాత శబరిమల ఆలయ సందర్శనకు వెళ్తానని ఆమె ప్రకటించారు. గత ఏడాది ఉద్రిక్త పరిస్థితుల మధ్య తృప్తి దేశాయ్‌ ఆలయ సందర్శనకు ప్రయత్నించగా భారీ స్థాయిలో ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే.

చిన్నారి భక్తురాలిని గుడిలోకి పంపిస్తున్న దృశ్యం
 

మరిన్ని వార్తలు