ఎట్టకేలకు తల్లిదండ్రులను చేరిన మూడేళ్ల చిన్నారి

31 Jul, 2019 20:21 IST|Sakshi

ముంబై: నీలి రంగు టవల్‌ చుట్టుకుని.. రెండు పిలకలతో.. చేతిలో స్వీట్‌తో.. కళ్ల నిండా దిగులుతో ఎవరి కోసమో ఎదురు చూస్తోన్న ఓ మూడేళ్ల చిన్నారి ఫోటో నిన్నంతా సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. దాంతో పాటు.. ‘ఈ రోజు 3.30గంటల ప్రాంతంలో ఈ చిన్నారి.. యారి రోడ్‌ వెర్సోవాలోని బియాంక గేట్‌ వద్ద కనిపించింది. రోడ్డు మీద వెళ్తున్న ఓ వ్యక్తి.. ‘ఎవరో ఆటోలో వచ్చారని.. ఈ పాపను ఇక్కడ వదిలేసి వెళ్లార’ని చెప్పాడు. తనను గుర్తు పట్టిన వారు ఎవరైనా.. తన కుటుంబ సభ్యులకు ఈ సమాచారం అందించండి’ అంటూ వాట్సాప్‌, ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ క్రమంలో వెర్సోవా పోలీసులు.. చిన్నారిని తమతో పాటు స్టేషన్‌కు తీసుకెళ్లారు. నేడు(బుధవారం) ఈ కథ సుఖాంతం అయ్యింది.

బాలికను తమతో పాటు తీసుకెళ్లిన పోలీసులు ఆమె నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బాలిక తన పేరు సాక్షి అని, తండ్రి పేరు సంతోష్‌ అని తెలిపింది. సరిగా ఇదే సమయంలో గోరేగావ్‌ భగత్సింగ్‌ నగర్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన కుమార్తె కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. తన పేరు సంతోష్‌ కుమార్‌ ఓం ప్రకాశ్‌ సావ్‌ అని.. తన కుమార్తె పేరు సాక్షి అని.. తనకు మూడేళ్ల వయసని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటికే సాక్షి గురించి సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో వెర్సోవా పోలీసులు సంతోష్‌ను స్టేషన్‌కు పిలిపించి.. పూర్తిగా విచారించి సాక్షిని తండ్రికి అప్పగించారు.

ఈ విషయం గురించి సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ‘నా భార్య గర్భవతి. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లే తొందరలో.. నా కూతురు గురించి మర్చిపోయాను. తనను అక్కడే వదిలేసి వెళ్లాను. కాసేపయ్యాక చూస్తే.. సాక్షి కనిపించలేదు. దాంతో పోలీసులను ఆశ్రయించాన’ని తెలిపాడు. బాలికను క్షేమంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చిన ముంబై పోలీసులను నెటిజన్లు తెగ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వార్తలు