పాత పథకాలకు మోదీ కొత్త పేర్లు

26 Sep, 2017 16:27 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పాత పథకాలకు కొత్త పేర్లు పెట్టడంలో పెద్ద దిట్ట మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ విషయంలో ఆయనకు ఆయనే సాటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశంలోని భారతీయులందరికి విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ఆయన సోమవారం నాడు సౌభాగ్య స్కీమ్‌ లేదా ‘ప్రధాన మంత్రి సహజ్‌ బిజిలీ హర్‌ ఘర్‌ యోజన’ పథకాన్ని ప్రారంభించారు. ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో ప్రతి మారుమూల ప్రాంతంలో ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని కూడా ఆయన తన ప్రసంగంలో పక్కాగా చెప్పారు. ప్రభుత్వం ప్రతి పేద వాడి ఇంటికెళ్లి విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తుందని, అందుకయ్యే ఖర్చును పేదవాడు భరించే పరిస్థితుల్లో లేడు కనుక దాదాపు 16,000 కోట్ల రూపాయల ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని కూడా ఆయన చెప్పారు.
 
వాస్తవానికి చెప్పాలంటే ఈ పథకంలో కొత్తదనమేమీ లేదు. ఇదే లక్ష్యంతో నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015, జూలై నెలలో ‘దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ్‌ జ్యోతి యోజన’ పథకాన్ని ప్రారంభించింది. పేద ప్రజలకు ఉచితంగా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వాలని, అలా ఇచ్చే రాష్ట్రాలకు అందుకయ్యే ఖర్చును సబ్సిడీల రూపంలో చెల్లిస్తామని ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి అప్పటికే దారిద్య్ర రేఖకు దిగువనున్న పేద ప్రజల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తున్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ‘రాజీవ్‌ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ యోజన’ పథకం కింద సబ్సిడీలను చెల్లిస్తోంది. ఈ రాజీవ్‌ గాంధీ గ్రామీణ విద్యుద్దీకరణ పథకాన్ని 2005లో అప్పటి కాంగ్రెస్‌ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

నాటి పథకమే నీటి పథకం కాదా?
ఈ లెక్కన 2005 సంవత్సరం నాటి పథకాన్ని మోదీ ప్రభుత్వం 2015 సంవత్సరంలో దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ్‌ జ్యోతి యోజనగా పేరు మార్చగా, అదే మోదీ ప్రభుత్వం అదే పథకాన్ని ఇప్పుడు సౌభాగ్య స్కీమ్‌ కింద పేరు మార్చింది. పేరు మార్చినందుకు పథకంలో కొద్ది మార్పులైన ఉండాలనుకున్నారేమో దారిద్య్ర రేఖకు ఎగువనున్న వారు 500 రూపాయలు చెల్లిస్తే విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని, దాన్ని కూడా పది వాయిదాల్లో చెల్లించవచ్చని చెప్పారు. మొబైల్‌ ప్రీ పెయిడ్‌ చార్జిల్లాగా వీరికి ప్రీపెయిడ్‌ మీటర్లను మంజూరు చేస్తామని లింకు పెట్టారు. ఈ లింక్‌లో ఉన్న కిటుకేమిటో మాత్రం ప్రధాని నరేంద్ర మోదీగానీ, ఆయన చెప్పినట్లుగా కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌గానీ వివరించలేదు.

మొత్తం పదివాయిదాలు, అంటే 500 రూపాయలను చెల్లించాక ప్రీ పెయిడ్‌ మీటర్లను మంజూరు చేస్తారా, ఒక్క వాయిదా, అంటే అందులో 50 రూపాయలను చెల్లించగానే కనెక్షన్‌ ఇస్తారా? ప్రీ పెయిడ్‌ కనీస చార్జీలు ఎంత ఉంటాయి? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు లేవు. ఉత్తరప్రదేశ్‌ లాంటి రాష్ట్రంలో ప్రాథమిక ఒక కిలోబాట్‌ విద్యుత్‌ కనెక్షన్‌కు రైల్వే లైన్ల ఖర్చును కలుపుకొని 810 రూపాయలు అవుతుండగా, ఇతర రాష్ట్రాల్లో ప్రాథమిక కనెక్షన్‌కు 1460 రూపాయలు ఖర్చు అవుతున్నాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో 500 రూపాయలకే మోదీ ప్రభుత్వం ఎలా విద్యుత్‌ కనెక్షన్‌ను మంజూరు చేయగలదు? ఇప్పటికే విద్యుత్‌ లైన్లు ఉండి దారిద్య్ర రేఖకు ఎగువన నివసిస్తున్న ప్రజలు విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకోవడం లేదని ప్రభుత్వం భావిస్తుందా? అన్న సందేహం ఇక్కడ కలుగుతుంది. వాస్తవానికి దేశంలోని పలు గ్రామీణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లు లేకపోవడం వల్లనే ప్రజలు విద్యుత్‌ కనెక్షన్లు తీసుకోలేక పోతున్నారు. సరాసరి ఇంటికి ఓ వెయ్యి రూపాయలు లేక వారు విద్యుత్‌ కనెక్షన్‌కు వెరవడం లేదు. విద్యుత్‌ లైన్లు మంజూరు కాకనే అన్న విషయాన్ని కాకిని అడిగినా చెబుతుంది. విద్యుత్‌ లైన్ల కోసం వచ్చిన విజ్ఞప్తులు కుప్పలు తెప్పలుగా పడిఉన్న విషయం ప్రతి డివిజన్‌ స్థాయి విద్యుత్‌ కార్యాలయానికి వెళ్లి చూస్తే ఎవరికైనా తెలుస్తోంది.

4.53 కోట్ల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు
ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో దాదాపు రెండు లక్షల గ్రామాలకు పూర్తిగా విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. అంటే దాదాపు 6,10,000 గ్రామీణులకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు. ఇళ్లపరంగా చెప్పాలంటే 4.53 కోట్ల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్లు లేవు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లైనా ఇప్పటికీ నాలుగున్నర కోట్ల ఇళ్లకు విద్యుత్‌ కనెక్షన్‌ లేదా? అంటూ మోదీ సైతం ఆవేదన వ్యక్తం చేశారు. అందుకోసం పేదలకు ఉచితంగా విద్యుత్‌ సౌకర్యం అందించేందుకు 16,320 కోట్ల రూపాయలు అవుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసిందని, అందులో కేంద్ర ప్రభుత్వం 12,320 కోట్ల రూపాయలను తన వాటా కింద కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల కోసం ఇందులో 10.587 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు కూడా చెప్పారు.

2011 జనాభా లెక్కల్లో ఈ వివరాలు లేవుగదా!
 గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ కనెక్షన్‌లేని పేద వాళ్లను ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నకు 2011 సంవత్సరం నాటి జనాభా డేటా ప్రకారం గుర్తిస్తామని కేంద్రం మీడియాకు వివరణ కూడా ఇచ్చింది. 2011 నాటి జనాభా డేటాలో విద్యుత్‌ కనెక్షన్లు ఉన్న ఇళ్లు, లేని ఇళ్లు అనే వివరాలు లేవన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా! సరే ఇళ్లిళ్లు తిరిగి తెల్ల రేషన్‌ కార్డు ఆధారంగానో, ఆదాయ వివరాల ఆధారంగానో ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తారని అనుకుందాం! 2018 సంవత్సరం డిసెంబర్‌ నెల నాటికి గ్రామీణ ప్రాంతాల పూర్తి విద్యుద్ధీకరణ కోసం దీన్‌దయాళ్‌ గ్రామ్‌ జ్యోతి యోజన కింద కేంద్రం 43,033 కోట్ల రూపాయలను 2015 సంవత్సరంలో కేటాయించినప్పుడే మొత్తం అయ్యే ఖర్చులో 30 శాతం నిధులకు ఇవి సమానమని విద్యుత్‌ శాఖకు చెందిన ఆర్థిక నిపుణలే అంచనా వేశారు. మరి ఇప్పుడు పేరు మార్చిన పథకం కింద విడుదల చేస్తున్న నిధులు ఎన్ని ఇళ్ల కనెక్షన్లకు సరిపోతాయి!?

మరిన్ని వార్తలు